సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యర్థాల నిర్వహణ చేపట్టాలి: కలెక్టర్

by Kodari Anjali |

పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టం చేసి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యర్థాల నిర్వహణ చేపట్టాలి:  కలెక్టర్
X

దిశ, సూర్యాపేట: పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్)ను మరింత పటిష్టం చేసి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. పట్టణ పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి అలసత్వం సహించబోమని స్పష్టం చేశారు.బుధవారం స్థానిక కలెక్టరేట్ లో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల పరిధిలో ఎండ్-టు-ఎండ్ వ్యర్థాల సేకరణ, శానిటేషన్ ప్లాన్ అమలుపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి మున్సిపాలిటీ వద్ద శానిటేషన్ ప్లాన్‌కు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, రీసైక్లింగ్ ప్రక్రియలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం చెత్త సేకరణ విధానాన్ని సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా నాలుగు విభాగాలుగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. గతంలో పొడి, తడి చెత్తను మాత్రమే వేరు చేసేవారని, ప్రస్తుతం కొత్త మార్గదర్శకాల ప్రకారం పొడి చెత్త, తడి చెత్త, శానిటరీ వ్యర్థాలు, స్పెషల్ కేర్ వ్యర్థాలు వేర్వేరుగా సేకరిస్తున్నట్లు తెలిపారు.

ప్లాస్టిక్ వంటి స్క్రాప్ పదార్థాలను..

చెత్త వర్గీకరణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు వార్డు సభలను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం సూర్యాపేటలో సుమారు 80 శాతం మేర చెత్తను వర్గీకరించి విజయవంతంగా సేకరిస్తున్నట్లు అధికారులు సమావేశంలో వివరించారు.ప్రతి వార్డులో చెత్త సేకరణ వాహనాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. పొడి, తడి చెత్త కలవకుండా వాహనాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పట్టణంలో సేకరించిన వ్యర్థాల ప్రాసెసింగ్ కోసం రెండు డంపింగ్ యార్డులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నుంచి సేకరించిన వ్యర్థాలను జమ్మిగడ్డ యార్డుకు తరలించి అక్కడ ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ షెడ్డులో రీసైక్లింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించారు. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. పొడి వ్యర్థాల్లోని గాజు సీసాలు, ప్లాస్టిక్ వంటి స్క్రాప్ పదార్థాలను వేరు చేసి తరలించే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించినట్లు అధికారులు వివరించారు. ఈ విధానంతో సూర్యాపేట మున్సిపాలిటీకి సంవత్సరానికి సుమారు రూ.7 లక్షల మేర అదనపు ఆదాయం సమకూరుతోందని తెలిపారు.ప్రతి డంప్‌యార్డ్‌కు ప్రత్యేక ఇన్‌ఛార్జ్ అధికారిని నియమించాలని, సేకరించిన ప్రతి వ్యర్థం రీసైక్లింగ్ లేదా శాస్త్రీయ డిస్పోజల్‌కు చేరేలా పూర్తి వ్యవస్థ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.

వర్ ప్లాంట్లతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి..

తడి చెత్త, కూరగాయల వ్యర్థాల శాశ్వత పరిష్కారానికి బయో మిథనేషన్ ప్లాంట్లు అత్యంత ఉపయోగకరమని తెలిపారు. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను వంట అవసరాలకు, వైకుంఠ ధామాల్లోని ఇన్సినరేటర్ల నిర్వహణకు వినియోగించవచ్చని సూచించారు. అదే విధంగా సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీల్లో మార్కెట్ ప్రాంతాల సమీపంలో బయో మిథనేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రోజుకు సుమారు ఒక టన్ను వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి పూర్తిస్థాయిలో ప్రాసెస్ చేస్తున్నట్లు సమావేశంలో వెల్లడించారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగానికి సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ భట్టీలలో ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగించడంతో పాటు తారు రోడ్ల నిర్మాణంలో మిశ్రమంగా ఉపయోగించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. రవాణా ఖర్చులు తగ్గించే దిశగా సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీలు సంయుక్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి హరి సింగ్ మున్సిపల్ కమిషనర్లు సూర్యాపేట కోదాడ తిరుమలగిరి హుజూర్నగర్ నేరేడుచర్ల హనుమంత రెడ్డి రమాదేవి నాగరాజు సతీష్ కుమార్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story