ఎన్నికల విధులకు హాజరు కాకపోతే సస్పెన్షన్: కలెక్టర్

by Bhanu |

ఎన్నికల విధులకు హాజరు కాకపోతే సస్పెన్షన్ వేటు తప్పదని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. శనివారం జోనల్, రిటర్నింగ్, ప్రిసైడింగ్, అధికారుల శిక్షణ తరగతుల్లో ఆయన రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఎన్నికల విధులకు హాజరు కాకపోతే సస్పెన్షన్: కలెక్టర్
X

దిశ, యాదాద్రి భువనగిరి: ఎన్నికల విధులకు, శిక్షణ తరగతులకు హాజరు కాని వారిపై సస్పెన్షన్ వేటు తప్పదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. శనివారం జోనల్, రిటర్నింగ్, ప్రిసైడింగ్, అధికారుల శిక్షణ తరగతుల్లో ఆయన రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డితో కలిసి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు విడతల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి శిక్షణ తరగతులకు ఎవరైనా గైర్హాజరు అయినా, ఎన్నికల విధులు ఆర్డర్ కాపీ తీసుకోకపోయిన, ఎన్నికల విధులకు హాజరు కాకపోయిన వారిపై సస్పెన్షన్ వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికల విధులు ప్రతి ఒక్కరు సక్రమంగా నిర్వహించి, ఎన్నికలు సజావుగా జరిగేందుకు బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు.

మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల విధులు చాలా కీలకమైనదని, ప్రతి అంశంపై క్షుణ్ణంగా అవగాహన కల్పించుకుని విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు సూచించారు. ఆలేరు, రాజాపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో తొలి విడతగా ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆత్మకూర్, బొమ్మలరామారం, తుర్కపల్లిలోని మండలాలలో ఈ నెల 11న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను తు.చ తప్పకుండా పాటిస్తూ.. ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.

పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, పోలింగ్ మెటీరియల్ ను జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలని, ఎన్నికల విధుల పట్ల ఆర్.ఓలు తమ బృందంలోని ఎన్నికల సిబ్బంది అందరికీ నియమ, నిబంధనల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఎక్కడ కూడా తప్పిదాలకు తావు లేకుండా సజావుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయగలుగుతారని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకొని, సదుపాయాలను పరిశీలించుకోవాలని, ఓటింగ్ కంపార్ట్‌మెంట్, సిటింగ్ ఏర్పాట్లు తదితర వాటిని నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు. శిక్షణా తరగతులలో సూచించిన అంశాలను విధిగా పాటించాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా, అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సజావుగా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించి, జిల్లాకు మంచి పేరు తేవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హితవు పలికారు.

Next Story