పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి : క‌లెక్ట‌ర్ బి. చంద్ర‌శేఖ‌ర్

by Nallavelli.Anjaneyulu |

మున్సిపల్ ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ కోరారు.

పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి : క‌లెక్ట‌ర్ బి. చంద్ర‌శేఖ‌ర్
X

దిశ, నల్లగొండ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ కోరారు. ఇందుకు అన్ని మున్సిపాలిటీలలో ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిప‌ల్ ఎన్నికలపై శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 7, 8 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుందని అందువల్ల‌ ఎన్నికల విధులలో నియమితులైన ఉద్యోగులందరూ ఫామ్ -12 సమర్పించాలని కోరారు. ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాల విషయంపై మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధులకు లేఖ ద్వారా తెలియజేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ పై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించాలన్నారు. ఓటరు చీటీల పంపిణీలో భాగంగా అన్ని మున్సిపాలిటీలలో 54% చీటీలను పంపిణీ చేయడం జరిగిందని, రేపు సాయంత్రంలోగా 100% చీటీలు పంపిణీ చేయాలన్నారు.


బ్యాలెట్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించుకుని సేఫ్ కస్టడీలో ఉంచాలని, బ్యాలెట్ పేపర్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటరు మార్కుడ్ కాపీని సిద్ధం చేసుకోవాలని, బ్యాలెట్ బాక్స్ లను పరిశీలించుకోవాలని, ఏ పోలింగ్ కేంద్రానికి ఏ బ్యాలెట్ బాక్స్ ను పంపిస్తున్నది స్పష్టంగా మార్క్ చేయాలని, అన్ని పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలను మరోసారి పరిశీలించాలని, ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ,కౌంటింగ్ కు సంబంధించి జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ మెటీరియల్ పరిశీలన, సైలెన్స్ పీరియడ్ గురించి అన్ని రాజకీయ పార్టీలకు ,పోటీలో ఉన్న అభ్యర్థులకు విస్తృతంగా తెలియజేయాలని, మున్సిపల్ ఎన్నికల సామాగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలను జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో ఒకే విధంగా ఉండేలా ఏర్పాటు చేయడం, వాటికి కేటాయించిన సిబ్బందికి శిక్షణ ఇవ్వడం పూర్తి చేయాలన్నారు.


పోలింగ్ రోజున అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఏలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. ఓటర్లు ఎన్నికల సంఘం గుర్తించిన 18 గుర్తింపు కార్డులలో ఏదో ఒక దానిని గుర్తింపుగా చూయించి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి ఓటింగ్ శాతం పంపించాలని ఆదేశించారు. ఈ నెల 13న నిర్వహించే ఓట్ల లెక్కింపుకు కౌంటింగ్ కేంద్రాలలో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడింగ్, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. అలాగే మీడియా కేంద్రం ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ కేంద్రంలో వినియోగించే టేబుల్లు, కౌంటింగ్ ఏజెంట్ల నియామకం వంటివి ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, నల్గొండ ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి ,మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ, చండూర్ ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు మాట్లాడారు.

Next Story