యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి..ఎప్పుడంటే ?

by velandi.Saikiran |   (  Updated:2026-05-14 22:16:26  IST  )

ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.

యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి..ఎప్పుడంటే ?
X

నారసింహుడు మెచ్చేలా..భక్త కోటి మురిసేలా

23న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి?

తిరుమల తరహా ట్రస్టు బోర్డు పాలనకు శ్రీకారం?

వేద పాఠశాలకు శంకుస్థాపన

ఆశావహుల పైరవీలు

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. అ ఈ క్రమంలోనే ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.

వేద పాఠశాలకు శంకుస్థాపన.. అభివృద్ధి పనులకు ఊతం...

ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట టెంపుల్ సిటీలో నిర్మించనున్న వేద పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ఈ పాఠశాలను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీంతో పాటు కొండపైన భక్తుల సౌకర్యార్థం చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ చేసి, పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

16 ఏళ్ల నిరీక్షణకు తెర.. ‘తిరుమల’ తరహా బోర్డు.. ఏర్పాటు!

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి గత 16 సంవత్సరాలుగా పాలకమండలి లేదు. 2010 నుంచి ఇప్పటివరకు కూడా పాలకమండలి లేకుండానే ఆలయ నిర్వహణ నడుస్తుంది. చివరిసారిగా 2007 నవంబర్ లో ఏర్పాటు అయిన పాలకమండలి 2009 వరకు కొనసాగింది. అయితే తిరిగి యాదగిరిగుట్టలో పాలకమండలి ఏర్పాటు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తుల తాకిడి పెరిగిన నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టకు సైతం పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తి కలిగిన పాలక మండలి (బోర్డు) ఏర్పాటుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. 2007లో నియమించిన కమిటీ గడువు 2009లో ముగిసింది. అప్పటి నుండి దాదాపు 16 ఏళ్లుగా పూర్తి స్థాయి బోర్డు లేకపోవడంతో పాలన వంశపారంపర్య ధర్మకర్తపైనే నడుస్తోంది. ప్రత్యేక బోర్డు ఏర్పాటు ద్వారా నిధుల కేటాయింపు, భక్తుల వసతులు, కాటేజీల నిర్మాణం వంటి కీలక నిర్ణయాల్లో వేగం పెరగనుంది.

వైటీడీఏ పనుల పర్యవేక్షణ.. దాతల ముందుకు...

పెద్దగుట్టపై వందలాది ఎకరాల భూమి అందుబాటులో ఉన్నా, బోర్డు లేని కారణంగా కాటేజీల నిర్మాణానికి ముందుకు వచ్చే దాతలు వెనుకంజ వేస్తున్నారు. సీఎం పర్యటన తర్వాత ఈ అడ్డంకులు తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికే బోర్డులో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుండటంతో, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని ఆశిస్తున్నారు.

రాజకీయ సెగ.. ఆశావహుల పైరవీలు....

సీఎం పర్యటన ఉండనున్న నేపథ్యంలో, బోర్డు ఏర్పాటు వార్తలు రావడంతో అధికార పార్టీ నేతల్లో సందడి మొదలైంది. రాజధానికి చేరువలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ఆలయ బోర్డులో సభ్యత్వం కోసం నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ నాయకుల ద్వారా పదవుల కోసం భారీగా పైరవీలు మొదలుపెట్టారు. అటు వేద పాఠశాల స్థాపన, ఇటు శక్తివంతమైన పాలక మండలి ఏర్పాటుతో యాదగిరిగుట్ట విశ్వవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉంది.

Next Story