- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుంగతుర్తికి నేనున్నాను.. రేషన్ కార్డుల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి
తిరుమలగిరిలో రాష్ట్రవ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం 4:20కు హెలికాప్టర్లో చేరుకుని, సభా వేదికపైకి వచ్చారు.

దిశ, తిరుమలగిరి : తిరుమలగిరిలో రాష్ట్రవ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం 4:20కు హెలికాప్టర్లో చేరుకుని, సభా వేదికపైకి వచ్చారు. సభ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి సహకారంతో తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించే అవకాశం ఇచ్చిన తుంగతుర్తి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తుంగతుర్తి ప్రాంతం తెలంగాణ సాయుధ పోరాటంలో విశేష స్థానం కలిగిన ఉద్యమాల గడ్డ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ ప్రాంతానికి వస్తూ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టడం ప్రజల అదృష్టమన్నారు.
అతను దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి తుంగతుర్తి, అడ్డగూడూర్, శాలిగౌరారం ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా బునాదిగాని కాలువ పనులు పూర్తి చేయాలని, అడ్డగూడూరు మండలం ధర్మారం వరకు కాలువ వెడల్పు పెంచాలని చెప్పారు. అడ్డగూడూర్, నాగారం కొత్త మండలాలకు ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, ఉద్యమాల గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వాలు పేదల సంక్షేమం పట్టించుకోలేదని, 9 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
తుంగతుర్తి అభివృద్ధికి సహకారం అందిస్తానని, పెండింగ్‌లో ఉన్న లింకు రోడ్లను పూర్తిచేస్తామని తెలిపారు. కొత్త మండలాలకు కార్యాలయాల నిర్మాణానికి నిధులు ఇచ్చినట్లు తెలిపారు.
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి..
తన సొంత మండలం తాటిపాములపై ప్రేమతో తుంగతుర్తి అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. బునాదిగాని కాలువ కోసం 200 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ కాలువ కోసం భూసేకరణ బాధ్యత స్థానిక ప్రతినిధులదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్న రోజును పండుగ దినంగా పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం..
గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పేదలకు న్యాయం జరగలేదని, రేషన్ కార్డులు లేక బియ్యం కొనే వీలు లేక ఇబ్బంది పడ్డారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీకి తిరుమలగిరి కేంద్రంగా ఎంపిక చేశామని, సూర్యాపేట జిల్లాలో కూడా సన్న బియ్యం పంపిణీ చేశామని తెలిపారు.
తుంగతుర్తి మండలానికి 1000 కోట్ల రూపాయలతో సాగునీరు అందించే ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఉచిత బస్సు, ఉచిత కరెంట్, రుణమాఫీ వంటి పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు. పేదలకు ఇళ్లు మంజూరు చేస్తున్నామని, రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడులు అందిస్తున్నామని, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
పెద్దకుటుంబ పాలనను అరికట్టి ప్రజల పాలన తీసుకొచ్చామని, బిఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని ఆరోపించారు. తిరుమలగిరి మున్సిపల్‌లో పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కాలేజీగా, జూనియర్ కాలేజీకి కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. తిరుమలగిరి ప్రాంతం చరిత్రలో గొప్ప సాయుధ పోరాట యోధులను ఇచ్చిన గడ్డ అని చెప్పారు.
9 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేయడం, పాత కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ మన్నిస్తుంటే, కొత్తగా కట్టిన కాలేశ్వరం మూడు సంవత్సరాల్లో పనికిరాకుండా పోయిందని విమర్శించారు. మహిళా సంక్షేమం కోసం ఆర్టీసీ బస్సులు, పాఠశాలల అభివృద్ధి, మహిళా సంఘాలకు రుణాలు, బస్సులు, పెట్రోల్ బంక్‌లు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టినట్లు చెప్పారు.
తుంగతుర్తికి గోదావరి జలాలు తీసుకువస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కార్యకర్తలను కోరారు. తెలంగాణను 1 బిలియన్ డాలర్ల ఎకానమిగా మార్చే లక్ష్యాన్ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 2024–2034 మధ్యకాలంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.






