- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిట్టీల వ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్య
భారీ అప్పుల భారం తాళలేక చిట్టీల వ్యాపారం చేస్తున్న వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది.

దిశ, మర్రిగూడ: భారీ అప్పుల భారం తాళలేక చిట్టీల వ్యాపారం చేస్తున్న వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం, మండలంలోని రాజపేట గ్రామపంచాయతీకి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు ఎన్. గోపి నాయక్ (42) ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వై జంక్షన్ రోడ్డులో పురుగుల మందు సేవించి మృతి చెందాడు. గోపి నాయక్ గత కొంత కాలంగా చిట్టీల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతని దగ్గర సుమారు 200 మందికి పైగా వ్యక్తులు చిట్టీలు వేసినట్టు సమాచారం.
ఒక్కొక్క చిట్టీ రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య ఉండగా, అతను సుమారు రూ.2 కోట్ల వరకు అప్పుల్లో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. డబుల్ ధమాకా, పంపర్ ఫ్యాక్టరీ వంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి మోసపోయినట్టు సన్నిహితులు తెలిపారు. అప్పుల ఒత్తిడితో గోపి నాయక్ మూడు నెలల క్రితమే ఒకసారి ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం. ఇటీవల అప్పుల భారంతో వడ్డీలు కట్టలేక, చిట్టీలు వేసిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వలేని స్థితికి చేరడంతో గోపి నాయక్ పురుగుల మందు తాగి తన ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనతో అతని వద్ద చిట్టీలు వేసిన బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
తమ సంపాదన మొత్తం కోల్పోతామని భయంతో వారు లబోదిబోమంటున్నారు. చట్టబద్ధ లైసెన్సులు లేకుండానే గ్రామాలలో చిట్టీలను నడుపుతూ ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్న వారిపై పోలీసు శాఖ సీరియస్ గా వ్యవహరించి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






