- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వీజ్ లైఫ్ చెరలో ‘సీలింగ్’ భూములు!!
భూమి లేని నిరుపేదకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ భూములు నేడు ‘కార్పొరేట్ శక్తుల’ పాలవుతున్నాయి.

దిశ, ఆలేరు: భూమి లేని నిరుపేదకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ భూములు నేడు ‘కార్పొరేట్ శక్తుల’ పాలవుతున్నాయి. నాడు భూస్వామ్య వ్యవస్థకు చరమగీతం పాడుతూ, పేదలకు భూమిని పంచాలనే ఆశయంతో ప్రభుత్వం తీసుకొచ్చిన "సీలింగ్ యాక్ట్" ఆశయాలు ఆలేరు మండలంలో నిలువునా సమాధి అవుతున్నాయి. కొలనుపాక గ్రామంలోని పేదల సీలింగ్ భూములను ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ గుటకాయస్వాహా చేస్తుంటే, కాపాడాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘స్వీజ్ లైఫ్’.. మాయాజాలం..
ఆలేరు మండలం కొలనుపాక గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 425 లో గతంలో 1975 లో ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ ద్వారా అప్పటి భూస్వాముల నుంచి 5.36 ఎకరాల అదనపు భూమిని స్వాధీనం చేసుకుంది (ఆర్డిఓ కార్యాలయం సీలింగ్ ఫైల్ నెంబర్: 1562/75). ద్వారా ఆ భూమిని గ్రామంలోని నిరుపేదలకు, దళితులకు సాగు, జీవనోపాధి కోసం పంపిణీ చేసింది. దశాబ్దాలుగా ఆ భూములపై ఆధారపడి పేదలు బతుకుతున్నారు. అయితే, ఈ అమాయక పేద రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ‘బొక్క బాల్ రెడ్డి’ అనే వ్యాపార వేత్త రంగప్రవేశం చేశాడు. మాయ మాటలతో నమ్మించి, ఇతర సర్వే నంబర్ల (424, 426, 440) తో పాటు, చట్టప్రకారం బదలాయింపునకు వీల్లేని సర్వే నంబర్ 425 లోని సీలింగ్ భూమితో పాటు పట్టా భూమిని కలుపుకుని డాక్యుమెంట్ నంబర్లు 3890/2006, 1188/2007 ద్వారా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా, ఆ సీలింగ్ భూములను ‘స్వీజ్ లైఫ్ టౌన్‌షిప్ ప్రైవేటు లిమిటెడ్’ యజమాని ఎం. సత్యంకు (డాక్యుమెంట్ నెంబర్లు: 7354/2026, 1941/2008, 1942/2008) విక్రయించి చేతులు దులుపుకున్నాడు.
ప్రభుత్వ నిబంధనలు గాల్లోకి!
ప్రభుత్వ కఠిన నిబంధనల ప్రకారం సీలింగ్ భూములను కొనుగోలు చేయడం కానీ, అమ్మడం కానీ, లేఅవుట్లు చేయడం కానీ కచ్చితంగా చట్టవిరుద్ధం. కానీ, ‘స్వీజ్ లైఫ్’ సంస్థకు ఏ చట్టాలూ వర్తించవన్నట్లు వ్యవహరించింది. 2008 లోనే అక్కడ ఎలాంటి అనుమతులు లేని ఒక అనాధికార వెంచర్ వేసి, పేదల సీలింగ్ భూములను ప్లాట్లుగా మార్చి అమాయకులకు విక్రయించి కోట్లు గడించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదలాయింపునకు వీల్లేని సీలింగ్ భూములు ప్రైవేట్ సంస్థ చేతుల్లోకి ఎలా వెళ్లాయి? యాదగిరి గుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిషేధిత భూముల జాబితాలో ఉండాల్సిన ఈ సర్వే నంబర్ ఎలా రిజిస్ట్రేషన్ అయ్యింది? పేదల నోరు కొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు?
‘మామూళ్ల’ మత్తులో రెవెన్యూ అధికారులు?
ఈ అక్రమ ఆక్రమణల ఉదంతం, సాక్ష్యాలతో సహా ఆలేరు రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ, వారు కనీసం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీలింగ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని బాధితులు, ప్రజా ప్రతినిధులు నెత్తీనోరు బాదుకుంటున్నా, ఆలేరు రెవెన్యూ యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున ‘మామూళ్ల’ పంపిణీ జరిగిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యతను మరిచి, రియల్ ఎస్టేట్ సంస్థకు అధికారులు పరోక్షంగా వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వినిపి స్తున్నాయి.
వెంచర్ చుట్టూ భారీ ప్రహరీ.. ఒక ప్రత్యేక సామ్రాజ్యం!
స్వీజ్ లైఫ్ టౌన్‌షిప్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ అక్రమంగా ఆక్రమించిన ఈ ప్రభుత్వ భూమితో పాటు తను కొనుగోలు చేసిన సర్వే నెంబర్ల చుట్టూ ఎలాంటి అనుమతులు లేకుండానే ఒక భారీ ప్రహరీ గోడను నిర్మించింది. లోపలికి ఎవరూ రాకుండా సీసీ కెమెరాలు, సోలార్ విద్యుత్తు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని తలపించేలా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సీలింగ్ భూమిని ఆక్రమించి ఇంత జరుగుతున్నా స్థానిక యంత్రాంగం ఉలుకూ పలుకూ లేకుండా ఉండటం గమనార్హం.
ఉన్నతాధికారులు స్పందించాలి..
కళ్ల ముందే తమ భూములు అక్రమార్కుల పాలువుతుంటే ఏం చేయాలో తెలియక కొలనుపాక నిరుపేదలు, దళితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కొలనుపాక గ్రామంలోని సర్వే నంబర్ 425 లో జరుగుతున్న స్వీజ్ లైఫ్ టౌన్‌షిప్ అక్రమాలను అడ్డుకోని ఆ సంస్థ చెరలో బందీ అయిన సీలింగ్ భూములను తక్షణమే స్వాధీనం చేసుకొని, సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని, అక్రమార్కులకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






