ప్రమాదాలకు గురైన వారికి క్యాష్ లెస్ చికిత్స అందించాలి : డీజీపీ

by Taduka Kalyani |

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు క్యాష్ లెస్ చికిత్స అందించేందుకు ఆసుపత్రులు ముందుకు రావాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ వివి శ్రీనివాసరావు అన్నారు.

ప్రమాదాలకు గురైన వారికి క్యాష్ లెస్ చికిత్స అందించాలి : డీజీపీ
X

దిశ, చిట్యాల : రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు క్యాష్ లెస్ చికిత్స అందించేందుకు ఆసుపత్రులు ముందుకు రావాలని అందుకు గాను ప్రభుత్వం వారికి చికిత్స అనంతరం ఫీజు చెల్లించేలా త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్లు తెలంగాణ డిజిపి, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ వివి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ వస్తుందని దీనికి ప్రధాన కారణం అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడం, ఇతర రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడమే నన్నారు. వేగం కన్నా ప్రాణాలే ముఖ్యమని మనం క్షేమంగా, సురక్షితంగా ఇంటికి చేరడమే లక్ష్యంగా ఉండాలి తప్ప మరోటి కావొద్దు అన్నారు.

రహబీర్ అవార్డు..

రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలను తీసుకుంటుందని అందులో భాగంగా వెలిమేడు గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యల గురించి అవగాహన కల్పించడం వల్ల రోడ్డు ప్రమాద బాధితుల సంఖ్యను సగానికి సగం తగ్గించడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వ్యక్తిని గంటలోపు ఆసుపత్రికి చేర్చినట్లైతే 80 నుంచి 90 శాతం బాధితుడు బ్రతికే అవకాశం ఉంటుందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రహబీర్ అవార్డును ప్రవేశపెట్టిందని ఈ అవార్డు రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులను సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందేలా కృషిచేసిన వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు కింద 25 వేల రూపాయల నగదు తో పాటు ప్రత్యేక ప్రశంస పత్రం అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే త్వరలోనే ట్రాఫిక్ పోలీసులతో కలిసి ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని ప్రధాన ఉద్దేశం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి రోడ్ సేఫ్టీ పరికరాలను నియమాలను చూడడమన్నారు.. అనంతరం నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి రోడ్డు భద్రత నియమాలను పాటిస్తామని తెలుపుతూ అక్కడున్న ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు..

గ్రామపంచాయతీ ప్రత్యేక తీర్మానం..

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. గ్రామస్తులు ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించి వాహనం నడిపేలా తీర్మానం చేశారు. ఒకవేళ హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే ఆ వాహనాన్ని గ్రామస్తులు ఎవరైనా ఫోటో తీసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తీర్మాన ఉద్దేశంగా పేర్కొన్నారు. ఈ తీర్మాన కాపీని సభాముఖంగా సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, తహసిల్దార్ విజయ్ కుమార్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, ఉప సర్పంచ్, నాయకులు అంతటి నరసింహ గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు పాల్గొన్నారు..

Next Story