- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమాలకు కేరాఫ్.. ఈ తహసీల్దార్ కార్యాలయం
మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం అక్రమ వసూళ్లకు అడ్డాగా మారిందని ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి

దిశ, మర్రిగూడ : మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం అక్రమ వసూళ్లకు అడ్డాగా మారిందని ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు కాసుల కక్కుర్తి అలవాటు పడి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మండల కేంద్రంలోని నివాస స్థలాలు ఉన్న సర్వే నంబర్లు కలిగిన భూములు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్లయితే ధరణి మాడ్యూల్స్‌ను అడ్డం పెట్టుకుని అధికారులు వారి వారసులకు పట్టా పాస్ బుక్కులు జారీ చేశారు. 2018లో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత మండల కేంద్రంలోని సర్వే నంబర్ 88, 8, 5, 23, 21, 20, 19, 18, 145 ఇండ్ల స్థలాలకు పాస్ బుక్కులు జారీ చేశారు. దీంతో పాసు బుక్కులు పొందిన యజమానులు మీకు మా తల్లిదండ్రులు తక్కువ భూమి అమ్మారని, మీకు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇప్పుడున్న మార్కెట్ రేటు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని కోర్టు నుంచి నోటీసులు పంపారు. దీంతో నివాస స్థలాలు ఉన్న యజమానులు లబోదిబోమంటూ రోడ్డున పడ్డారు.
అలాగే కుదబక్షపల్లి, మేటి చందాపురం ,సోమరాజుగూడెం గుట్టల భూములు కోర్టులో ఉండగా.. ఇవేమీ పట్టనట్లుగా కలెక్టర్ కార్యాలయంలో కోర్టు నోటీసులను ఓపెన్ చేయించి, వందల ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ చేసి అధికారులు రూ.కోట్లు దండుకున్నారని ఆరోపణలు లేకపోలేదు. అలాగే భూమి క్రయవిక్రయాల్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు తప్పనిసరిగా పాస్ బుక్కు ఉండాల్సి ఉంది. కానీ అధికారులు చేయి తడిపితే ధరణి ఆపరేటర్ నుంచే అక్రమ వసూళ్లు దందాకు తెరలేపి నిబంధనలను తుంగలోకి తొక్కి యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఒకరికి భూమి విక్రయించి పాసుబుక్ సైతం అప్ప చెప్పి కొంత నగదును తీసుకుని ,మరొకరికి అదే భూమి విక్రయించి పాసుబుక్కు లేకుండానే రిజిస్ట్రేషన్ చేయడం ఈ కార్యాలయంలో పరిపాటిగా నడుస్తుంది. కార్యాలయంలో జరుగుతున్న అక్రమ దందాపై ఉన్నతాధికారులు దృష్టి సారించి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులపై నిఘా ఉంచి అక్రమ అధికారులపై వేటువేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇళ్ల స్థలాలకు పాస్ బుక్కులు జారీ...
ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని ఇక్కడి అధికారులు అక్రమ దందాకు తెర లేపారు. మండల కేంద్రంలోని నివాస స్థలాలకు అధికారులు చేతివాటం ప్రదర్శించి పాస్ బుక్కులు జారీ చేశారు. పాసుబుక్కులు పొందిన వారు మా తాతలు, తండ్రులు మీకు తక్కువ ధరకు అమ్మారని, తక్కువ భూమి అమ్మితే మీరు ఎక్కువ ఆక్రమించారని కోర్టుల నుంచి నివాస స్థలాల వారికికు నోటీసులు జారీ చేశారు. ఏళ్లకు ఏండ్లుగా నివాస స్థలాలు ఏర్పరచుకొని గ్రామపంచాయతీ రికార్డుల్లో ఉన్నప్పటికీ అక్రమంగా నోటీసులు జారీ చేయడంపై మండల కేంద్రంలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాసుబుక్కులు రాగానే అధికారులను మంచిగా చేసుకుని రోజువారీగా వారికి కావాల్సిన విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజాపాలనలో సేద్యం లేని భూములకు రైతుబంధు నిలిపివేస్తామని గ్రామ సభల్లో ప్రకటించడంతో.. నివాస స్థలాలను పట్టా చేసుకున్న యజమానులు బహిర్గతమయ్యారు. 60ఏళ్ల కిందట అమ్మిన భూములకు పాస్ బుక్కులు ఎలా జారీ చేస్తారని, ఇళ్లస్థలాలు ఉన్నవారందరూ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆ పాస్ బుక్కులను రద్దుచేసి ఆబాదిలోకి ఆ భూములను చేర్చాలని డిమాండ్ చేశారు. భూభారతి చట్టం వచ్చిన తర్వాత నివాస స్థలాలు ఉన్న సర్వే నంబర్లను ఆబాదిలోకి మార్చుతామని అధికారులు వారికి హామీ ఇచ్చారు.
పాస్ బుక్కులు లేకుండా భూముల రిజిస్ట్రేషన్...
గత నెల 21న వట్టిపల్లిలోని 160 సర్వే నంబర్‌లో రెండెకరాల ఒక గుంట భూమిని నీల మహేష్ అదే గ్రామానికి చెందిన సిరికొండ మల్లమ్మ దగ్గర కొనుగోలు చేసి కొంత నగదును అప్ప చెప్పి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పూర్తిగా చెల్లిస్తానని చెప్పడంతో.. ఆమె మహేష్ కు పాస్ బుక్ సైతం అప్ప చెప్పింది. ఆ తర్వాత అదే భూమిని వేరొకరికి విక్రయించి పాసు బుక్కు లేకుండానే అధికారులతో కుమ్మక్కై ఈ నెల 6న రిజిస్ట్రేషన్ చేసింది. దీంతో సదర్ బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. చండూరు ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కు 11న ఫిర్యాదు చేశాడు. పాస్ బుక్కులు లేకుండా రిజిస్ట్రేషన్‌ను ఎలా చేస్తారని కొనుగోలు చేసిన బాధితుడు నీల మహేష్ అధికారులను నిలదీయడంతో.. వందల భూములు పాస్ బుక్కులు లేకుండానే చేశారని, ఒకరికి ఒకరు కార్యాలయ ఆవరణలోనే అధికారులు, అటు ప్రజాప్రతినిధులు తగులాడడం పలువురిని విస్మయానికి గురి చేసింది. ధరణి ఆపరేటర్ అన్ని రెడీ చేసిన తర్వాత డిజిటల్ సైన్ చేయమని చెప్పినప్పుడే తాము వెళ్లి సంతకం చేస్తున్నామని, తమకు ఏమీ తెలియదని అధికారులు ఆపరేటర్‌పై నెపం వేయడం గమనార్హం. ఏది ఏమైనా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.






