అర్థంలేని విమర్శలతో కోల్పోతున్న ఉనికి : బీఆర్ఎస్ నేత సీతయ్య

by Disha Web Desk 20 |
అర్థంలేని విమర్శలతో కోల్పోతున్న ఉనికి : బీఆర్ఎస్ నేత సీతయ్య
X

దిశ, తుంగతుర్తి : అర్థం లేని విమర్శలతో ప్రతిపక్షాల ఉనికి రోజురోజుకు దిగజారి పోతోందని మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం తుంగతుర్తి మండలం బండరామారం గ్రామంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను విమర్శించే నైతికహక్కు ప్రతిపక్షాలకు లేదని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పై ఎమ్మెల్యే కిషోర్ కుమార్ మొదటి నుండి ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుంటే దానికి సహకరించాల్సిన ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. ముఖ్యంగా నియోజకవర్గం ఏర్పడి దశాబ్దాల కాలం గడుస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాకే అభివృద్ధి పదాన ముందుకు సాగుతోందని వివరించారు.

నియోజకవర్గ ప్రజ సుదీర్ఘకాల వాంఛగా మారిన ఎస్సారెస్పీ రెండవ దశజలాలు నియోజకవర్గానికి తెప్పించడం ఎమ్మెల్యే కిషోర్ తోనే సాధ్యపడిందని అన్నారు. తొమ్మిదిన్నర ఏండ్ల కాలంలో వేలాది కోట్ల నిధులతో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల తమఉనికి దెబ్బతింటుందనే భయం ప్రతిపక్షాలకు పట్టుకుందని, ఇందులో భాగంగానే అర్థం లేకుండా విమర్శలకు దిగుతున్నారని సీతయ్య మండిపడ్డారు. ఇప్పటికైనా విమర్శలకు స్వస్తి చెపుతూ అభివృద్ధి పథకాల అమలులో ఎమ్మెల్యే కిషోర్ తో కలిసి రావాలని ఆయన ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. ఇదిలా ఉంటే త్వరలోనే తుంగతుర్తికి మంజూరైన వంద పడకల ఆసుపత్రికి ఎమ్మెల్యే కిషోర్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మూడోసారి తుంగతుర్తి నుండి కిషోర్ కుమార్ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టి మంత్రి పదవి లభించడం ఖాయమైపోయిందని అన్నారు.


Next Story