- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యావ్యవస్థపై మండిపడ్డ తల్లి.. ‘కాక్రోచ్’ ధర్నాలో 13 ఏళ్ల కుమార్తెతో కలిసి నిరసన
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ శనివారం ‘కాక్రోచ్’ల దండయాత్రతో దద్దరిల్లింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ శనివారం ‘కాక్రోచ్’ల దండయాత్రతో దద్దరిల్లింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీకేజీతో పాటు, ఇతర పోటీ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలు, లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళన కార్యక్రమం జరిగింది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపు మేరకు ఈ ధర్నాలో పాల్గొనేందుకు జెన్-జీ (Gen-Z) యువత భారీ ఎత్తున జంతర్‌మంతర్‌కు తరలివచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్న నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. కాగా, ఈ ధర్నాలో పాల్గొనేందుకు పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రత్యేకంగా అమెరికా నుంచి ఢిల్లీకి రావడం గమనార్హం.
విద్యావ్యవస్థపై తల్లి ఆగ్రహం..
ఈ ఆందోళనలో యువతతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొని కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 13 ఏళ్ల కుమార్తెతో కలిసి కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాలో పాల్గొన్న ఓ తల్లి జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత విద్యా విధానం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం ఉన్న విద్యా విధానం ఎంతో దారుణంగా తయారైంది. సీబీఎస్ఈ (CBSE) సిలబస్‌ను ఇష్టం వచ్చినట్లు మారుస్తున్నారు. సిలబస్ మారుస్తున్నారు సరే.. కానీ పుస్తకాలను మాత్రం చాలా ఆలస్యంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. చేతిలో పుస్తకాలు లేకుండా పిల్లలు ఎలా చదువుకుంటారు?’ అని ఆమె ప్రశ్నించారు. పిల్లలు రాత్రింబవళ్లు కష్టపడి చదువుకుంటే, దారుణంగా ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని, ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని ఆమె మండిపడ్డారు.
సమర్థుడైన వ్యక్తికి బాధ్యతలు ఇవ్వాలి..
పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని సదరు మహిళ డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆయన స్థానంలో సమర్థుడైన వేరొక వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని ఆమె స్పష్టం చేశారు. పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఆందోళనకు యువత నుంచి విశేష స్పందన లభించింది.






