- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రియల్ ఎస్టేట్ రారాజుగా 'మేడ్చల్-మల్కాజిగిరి'..
కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేట పరిధిలో భూముల ధరల చుక్కలు చుక్కలు చూపిస్తున్నాయి.

దిశ, మేడ్చల్ బ్యూరో: జిల్లాలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఐటీ కారిడార్‌కు సామీప్యత, ఓఆర్‌ఆర్ కనెక్టివిటీ, మెరుగైన మౌలిక సదుపాయాలతో మహానగరం శరవేగంగా విస్తరిస్తుండటంతో ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సవరించిన భూముల మార్కెట్ విలువలు అమల్లోకి రాగా, అత్యధిక డిమాండ్ ఉన్న మేడ్చల్ జిల్లాలో ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ ధరలకు, ప్రభుత్వ ధరలకు ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించే క్రమంలో రిజిస్ట్రేషన్ శాఖ మార్కెట్ విలువలను భారీగా సవరించింది. ప్రభుత్వం ఈ పెంపును స్థానిక అభివృద్ధి, డిమాండ్ ఆధారంగా 25, 50, 75, 100శాతాలు అనే ఆధారంగా నాలుగు శ్లాబులుగా విభజించింది. రిజిస్ట్రేషన్ ఫీజుల శాతంలో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయనప్పటికీ, పెరిగిన భూముల విలువల ఆధారంగా రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సిన మొత్తం భారీగా పెరగడంతో కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది.
కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేట పరిధిలో చుక్కలు తాకుతున్న రేట్లు
జిల్లాలో అత్యంత వేగంగా నివాస ప్రాంతాలుగా రూపాంతరం చెందుతున్న కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ధరల పెంపు గరిష్టంగా నమోదైంది. కుత్బుల్లాపూర్ ఎస్ ఆర్ ఓ పరిధిలోని చింతల్, గాజులరామారం, సూరారం, కొంపల్లి తదితర నివాస ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి 50 శాతం నుండి 100 శాతం వరకు మార్కెట్ విలువలు పెరిగాయి. కొంపల్లి మరియు దాని పరిసరాల్లోని ప్రైమ్ ఏరియాల్లో చదరపు గజం విలువ సగటున రూ. 20,000 నుండి రూ. 25,000 వరకు చేరగా, చింతల్, గాజులరామారం లాంటి ప్రాంతాల్లో చదరపు గజం విలువ రూ. 15,000 నుండి రూ. 18,000 వరకు నమోదైంది.
నివాస స్థలాలపై 75 శాతం నుండి...
మేడ్చల్ ఎస్ ఆర్ ఓ పరిధిలోని మేడ్చల్ టౌన్, అత్వెల్లి, గుండ్లపోచంపల్లి ప్రాంతాల్లో 75 శాతం నుండి 100 శాతం పెంపుదల కనిపించింది. జాతీయ రహదారి (NH-44), ఓఆర్‌ఆర్ వెంబడి ఉన్న కమర్షియల్ స్థలాల ధరలు దాదాపు రెట్టింపు అవ్వగా, ప్లాట్ల ధర సగటున చదరపు గజానికి రూ. 18,000 నుండి రూ. 22,000 పైనే నిర్ధారించారు. ఇక ఓఆర్‌ఆర్ కనెక్టివిటీ, కొత్త విల్లా ప్రాజెక్టుల రాకతో శామీర్‌పేట ఎస్ ఆర్ ఓ పరిధిలోని శామీర్‌పేట, తూంకుంట, అలియాబాద్ వైపు వ్యవసాయ, నివాస స్థలాలపై 75 శాతం నుండి 100 శాతం వరకు పెంపు నమోదైంది. హెచ్ ఎం డి ఎ పరిధిలోకి వచ్చే ఇక్కడి వ్యవసాయ భూముల కనీస విలువను సైతం ఎకరాకు రూ. 10 లక్షలుగా ఖరారు చేశారు.
ఐటీ విస్తరణ.. ఘట్‌కేసర్, ఉప్పల్ పరిధిలో జోరు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'లుక్ ఈస్ట్' పాలసీ, ఐటీ కారిడార్ విస్తరణ మరియు వరంగల్ హైవే (NH-163) ప్రభావంతో ఘట్‌కేసర్ ఎస్ ఆర్ ఓ పరిధిలోని ఘట్‌కేసర్, పోచారం, నారపల్లి పరిసర ప్రాంతాల్లో డిమాండ్ అమాంతం పెరిగింది. ఈ ప్రధాన రహదారుల వెంబడి రేట్లు 75 శాతం నుండి 100 శాతం వరకు పెరగగా, ప్లాట్ల మార్కెట్ విలువ సగటున చదరపు గజానికి రూ. 15,000 కు పైగానే స్థిరపడింది. ఉప్పల్ & కాప్రా ఎస్ ఆర్ ఓ పరిధిలో పెంపు 25 శాతం నుండి 75 శాతం మధ్య నమోదైంది. ప్రధాన ఉప్పల్ చౌరస్తా, ఏఎస్‌రావ్ నగర్ పరిసరాల్లో రేట్లు కాస్త ఎక్కువగా పెరగ్గా, యాప్రాల్, చర్లపల్లి వైపు సుమారు 15 శాతం నుండి 25 శాతం మధ్య మోస్తరు పెంపుదల కనిపించింది. ఉప్పల్ పరిధిలో ఫ్లాట్ చదరపు అడుగు విలువ సగటున రూ. 5,250 వరకు చేరింది.
మారిన అపార్ట్‌మెంట్ల లెక్కలు.. కూకట్‌పల్లి, బాచుపల్లిలో కొత్త విధానం
అపార్ట్‌మెంట్ కల్చర్‌కు కేంద్రాలైన కూకట్‌పల్లి, బాలానగర్ మరియు బాచుపల్లి ఎస్ ఆర్ ఓ పరిధిలో 25 శాతం నుండి 50 శాతం వరకు మార్కెట్ విలువలు సవరించారు. అయితే అపార్ట్‌మెంట్ల రేట్ల విషయానికి వస్తే ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో ఉన్న అంతస్తుల వారీ రేట్ల పద్ధతిని రద్దు చేసి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు భవనంలోని అన్ని ఫ్లోర్లకు ఒకే విధమైన మార్కెట్ విలువను వర్తింపజేశారు. దీని ప్రకారం కూకట్‌పల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్ పరిధిలో చదరపు అడుగు ఫ్లాట్ విలువ రూ. 6,000 నుండి రూ. 7,500 వరకు నిర్ణయించారు. విద్యాసంస్థలకు కేంద్రమైన బాచుపల్లి పరిధిలో ప్లాట్ల ధర ఏకంగా చదరపు గజానికి రూ. 21,000 గా నమోదైంది. కాగా, అప్పటికే పూర్తిగా అభివృద్ధి చెందిన మల్కాజిగిరి & అల్వాల్ ఎస్ ఆర్ ఓ పరిధిలోని మల్కాజిగిరి, నేరేడ్‌మెట్, అల్వాల్, బొల్లారం ప్రాంతాలలో మార్కెట్ ధరలకు, ప్రభుత్వ ధరలకు వ్యత్యాసం తక్కువగా ఉండటంతో ఇక్కడ కేవలం 25 శాతం నుండి శాతం లోపు మోస్తరు పెంపును మాత్రమే అమలు చేశారు.
రిజిస్ట్రేషన్ ఛార్జీలు పాతవే.. అయినా తప్పని భారం
రిజిస్ట్రేషన్ ఛార్జీల పర్సంటేజీలలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయనప్పటికీ, ప్రాథమిక మార్కెట్ విలువలు పెరగడంతో కొనుగోలుదారులపై అదనపు ఆర్థిక భారం పడక తప్పడం లేదు. ప్రస్తుతం పట్టణ మరియు మున్సిపల్ ప్రాంతాల్లో స్టాంప్ డ్యూటీ 5.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతం కలిపి మొత్తం 6 శాతంగా వసూలు చేస్తున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో స్టాంప్ డ్యూటీ 5.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 2 శాతం కలిపి మొత్తం 7.5 శాతాన్ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మేడ్చల్ జిల్లాలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోని సాగు భూములకు మాత్రం పాత ధరలనే యథాతథంగా ఉంచడం కాస్త ఊరటనిచ్చే అంశం.






