నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. త్వరలోనే 5 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

by Prasad Jukanti |   (  Updated:2026-06-06 09:00:10  IST  )

'ది హిందూ హడిల్' ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరానో స్పష్టం చేశారు.

నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. త్వరలోనే 5 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
X

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో ‘హైడ్రా’ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైడ్రా అనేది హిట్లర్‌కు అత్యంత ఇష్టమైన పదం. నేను హిట్లర్ నుంచే స్ఫూర్తి పొంది ‘హైడ్రా’ను ఏర్పాటు చేశానన్నారు. పేద ప్రజలు చెరువులను ఆక్రమిస్తే మానవతా దృక్పథంతో అర్థం చేసుకోవచ్చని కానీ ధనికులే జలాశయాలను ఆక్రమిస్తుండడం వల్లే తాము ‘హైడ్రా’ (HYDRAA)ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. బెంగళూరులో జరుగుతున్న ‘ది హిందూ హడిల్’ (The Hindu Huddle) ఆరో ఎడిషన్ సదస్సులో రెండో రోజైన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కోసం: తెలంగాణలో సుపరిపాలన’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర, సంచలన విషయాలను పంచుకున్నారు. హైడ్రా వ్యవస్థ కోసం 3,000 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని తీసుకున్నామని ఈ రోజు తెలంగాణలో జలాశయాలను ఆక్రమించడానికి ఎవరూ సాహసించలేకపోతున్నారన్నారు. అలాగే, రాష్ట్రంలో యువతను పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ‘ఈగిల్ ఫోర్స్’ను రంగంలోకి దించామని, దేశంలోనే డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తున్న అత్యుత్తమ ఫోర్స్ ఇదేనని తెలిపారు.

త్వరలో మరో ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్:

ఉద్యోగాల నియామకం కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కేసీఆర్ ఆ సమస్యను పరిష్కరించలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గ‌తంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ స‌భ్యుడిగా ఉన్నారని ఆయ‌న గ్రూప్‌-1 అభ్యర్థుల‌న ఇంట‌ర్వ్యూ చేస్తాడు. ఇంజినీరు, డాక్టర్‌, ఇత‌ర నియామ‌కాలు చేసే వ్యక్తి ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ హా? అని ప్రశ్నించారు. మేము వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామని 15 నెల‌ల్లో మేం 67,760 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. త్వరలోనే మరో 5 వేల పోలీసు ఉద్యోగ నియామ‌కాల నోటిఫికేష‌న్ ఇవ్వబోతున్నామన్నారు.

ఈవీలపై పన్ను మినహాయింపుతో ₹2,000 కోట్ల నష్టం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) జీరో టాక్స్ విధానాన్ని తెచ్చామని, దీనివల్ల ప్రభుత్వం రూ. 2,000 కోట్ల ఆదాయాన్ని నష్టపోతోందని వెల్లడించారు. నిరుద్యోగుల కోసం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, కార్పొరేట్ సీఈఓలే దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉంటూ సిలబస్‌ను నిర్ణయించి ఉపాధి కల్పిస్తారని తెలిపారు. తనకు ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టమని, గతంలో క్రమంతప్పకుండా ఆడేవాడినని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం సమయం దొరకడం లేదన్న సీఎం.. అందుకే స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సిని తెలంగాణకు ఆహ్వానించానని, త్వరలోనే ఫిఫా వరల్డ్ కప్ చూడడానికి సమయం కేటాయిస్తానని ఈ సందర్భంగా సరదాగా వ్యాఖ్యానించారు. తన పోటీ పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర లేదా గుజరాత్‌లతో కాదని సీఎం స్పష్టం చేశారు. గుజరాత్‌కు పెట్టుబడులు సహజంగా రావడం లేదు, అక్కడికి వెళ్లేలా ఒత్తిడి తెస్తున్నారు. గత 20 ఏళ్లుగా అక్కడ కేవలం ఒక్క అంబాసిడర్ మాత్రమే పని చేస్తున్నారు. నా పోటీ చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతోనే. వాటి నుంచే నేను స్ఫూర్తి పొందుతున్నాను. నా నినాదం ఒక్కటే.. ‘చైనా + 1’ అంటే అది ‘తెలంగాణ’ మాత్రమే. భవిష్యత్తులో అన్నింటినీ తెలంగాణలోనే ఉత్పత్తి చేసి చైనా స్థానాన్ని భర్తీ చేస్తామని అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

రైతుల రుణమాఫీ చేసి చూపాం:

పంట సేక‌ర‌ణ‌ను కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేదని ఎమ్మార్పీ ప్రక‌టించి చేతులు దులుపుకుంటోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. పంట ఉత్పత్తుల సేక‌ర‌ణ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదని.. ధాన్యం, మొక్కజొన్నతో పాటు ఇత‌ర పంట‌లు మేం సేక‌రిస్తున్నామన్నారు. రైతు భ‌రోసా కింద ఎక‌రాకు రూ.12 వేలు ఇస్తున్నామని చెప్పారు. గ‌తంలో మ‌హారాష్ట్ర త‌ర్వాత తెలంగాణ‌లోనే ఎక్కువ సంఖ్యలో రైతు ఆత్మహ‌త్యలు జ‌రిగేవన్నారు. మేము అధికారంలోకి వ‌చ్చాక 25,035 రైతు కుటుంబాల‌కు చెందిన రూ.20,616 కోట్ల రుణాల‌ను మాఫీ చేశామన్నారు. మ‌హిళా సాధికారిత‌కు మేం కృషి చేస్తున్నట్లు చెప్పారు. స్వయం సహాయక సంఘాల (SHG) ద్వారా 67 లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు.

Next Story