సర్ ఓటర్ నమోదులో బీఎల్‌ఏలదే కీలక పాత్ర: జగదీశ్ రెడ్డి

by Taduka Kalyani |

సర్ (SIR) ఓటర్ నమోదు ప్రక్రియలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని భావించి, అర్హులైన ప్రతి ఓటరును నమోదు చేయించడంలో బీఎల్‌ఏల (బూత్ లెవల్ ఏజెంట్లు) పాత్ర అత్యంత కీలకమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.

సర్ ఓటర్ నమోదులో బీఎల్‌ఏలదే కీలక పాత్ర: జగదీశ్ రెడ్డి
X

దిశ, హాలియా: సర్ (SIR) ఓటర్ నమోదు ప్రక్రియలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని భావించి, అర్హులైన ప్రతి ఓటరును నమోదు చేయించడంలో బీఎల్‌ఏల (బూత్ లెవల్ ఏజెంట్లు) పాత్ర అత్యంత కీలకమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం హాలియాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సర్ ఓటర్ నమోదు, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సర్ ఓటర్ నమోదు ప్రక్రియపై ముందుగా పార్టీ కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఓటర్ నమోదు, ఓటర్ల తొలగింపు ప్రక్రియలు, వివిధ ఫారాల వినియోగంపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కార్యకర్తలకు సవివరంగా వివరించారు. ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడం, తొలగించడం, సవరణలు చేయడం వంటి అంశాలపై స్పష్టత ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ కార్యకర్తల ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేసే అవకాశముందని, అందువల్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేయడంలో ఒకటేనని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అభివృద్ధిని వెనక్కి నెట్టిందని విమర్శించారు. కృష్ణా జలాల వాటాల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి శూన్యంగా ఉందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, బూడిద బిక్షమయ్య, ఇస్లావత్ రామచంద్ర నాయక్, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఆప్కాబ్ చైర్మన్ ఎడవల్లి విజేందర్ రెడ్డి, సాదం సంపత్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, వడ్డే సతీష్ రెడ్డి, సురభి రాంబాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story