నల్లగొండలో బైక్ దొంగల ముఠా అరెస్ట్...

by Bhanu |

తెలంగాణలో ఇటీవల వరుసగా జరుగుతున్న బైక్ చోరీల కేసులను ఛేదించేందుకు పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారు.

నల్లగొండలో బైక్ దొంగల ముఠా అరెస్ట్...
X

దిశ, నల్లగొండ క్రైం: తెలంగాణలో ఇటీవల వరుసగా జరుగుతున్న బైక్ చోరీల కేసులను ఛేదించేందుకు పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారు. అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగల ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన నలమాల యెర్రబ్బాయ్ అలియాస్ లూథర్, గుంజి అంకమరావు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మట్టిపల్లి శ్రీకాంత్ అనే ముగ్గురు వ్యక్తులు కూలిపనులు చేస్తూ జీవనోపాధి పొందుతూ ఉండేవారు. శ్రీకాంత్ ప్రస్తుతం తెలంగాణలోని దామరచర్ల మండలం జానపహాడ్ గ్రామంలో నివసిస్తున్నాడు.

ఈ ముగ్గురు కలిసి ఖరీదైన బైకులను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. గత మూడేళ్లుగా లూథర్ నల్లగొండ జిల్లాలోని దామరచర్ల, నల్లగొండ పట్టణం, నార్కెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్టూరు, పొన్నూరు పట్టణాల్లో ప్రభుత్వ కార్యాలయాల సమీపం, జనసంచార ప్రాంతాలైన హోటళ్లు, వైన్స్ వద్ద రాత్రి వేళల్లో ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్, పల్సర్ వంటి ఖరీదైన బైకులను లక్ష్యంగా చేసుకొని దొంగతనానికి పాల్పడేవాడు. దొంగిలించిన బైకులను అంకమరావు, శ్రీకాంత్‌ల సహాయంతో తక్కువ ధరకు విక్రయించి, దానితో వచ్చిన డబ్బును జల్సాలకు వినియోగించేవారు.

బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అలెర్ట్..

బైక్ చోరీలపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు అందడంతో, ఎస్పీ ఆదేశాలతో పోలీసులు గస్తీని కట్టుదిట్టం చేశారు. ఈ నెల 30న బుధవారం తెల్లవారుజామున వాడపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.

ఈ సమయంలో దొంగతనానికి పాల్పడిన లూథర్, అంకమరావు మోటార్ సైకిళ్లను విక్రయించేందుకు గుంటూరు వైపు వెళ్తుండగా పోలీసులు వారిని ఆపి విచారించారు. సమాధానాల్లో పొంతన లేకపోవడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, వారు చేసిన నేరాలను అంగీకరించారు.

వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు

వాడపల్లి పోలీస్ స్టేషన్‌లో 3 కేసులు, నల్లగొండ 1 టౌన్‌లో 2 కేసులు, 2 టౌన్‌లో 1, నల్లగొండ రూరల్ స్టేషన్‌లో 1, నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో 2, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో 1, మార్టూరు పోలీస్ స్టేషన్‌లో 2, పొన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో 1, రాజమండ్రి పట్టణంలో 1 కేసు నమోదయ్యాయి.

దొంగిలించిన బైకుల్లో 6 రాయల్ ఎన్‌ఫీల్డ్, 7 పల్సర్, 1 షైన్ బైక్ ఉన్నాయి. గతంలో నల్లగొండ జిల్లాలో బైక్ చోరీ కేసుల్లో కూడా ఈ నిందితుల పాత్ర ఉందని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఈ ముగ్గురు నిందితులు మొత్తం 36 బైకులను దొంగిలించగా, వాటిలో 14 బైకులు రికవరీ అయ్యాయి. మిగిలిన 22 బైకుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు సీజ్ చేసిన బైకుల విలువ సుమారు రూ. 26.50 లక్షలు అని ఎస్పీ వెల్లడించారు.

ఈ కేసును మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, సీసీఎస్ సీఐ డానియల్ కుమార్, వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది సతీశ్, భాస్కర్, వెంకటేశ్వర్లు, రషీద్, అలాగే సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్దన్ గిరి, రాంప్రసాద్, పుష్పగిరి, శ్రీనివాస్ రెడ్డి కలిసి అభినందనీయంగా చురుకుగా పని చేసినట్టు ఎస్పీ తెలిపారు.

Next Story