- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
17వ వార్డు ఏకగ్రీవంపై బిగ్ ట్విస్ట్!
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికపై తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికపై తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి చింతల ఉమా మహేశ్వరీ ఏకగ్రీవ ఎన్నిక అక్రమమని ఆరోపిస్తూ కాలనీవాసులు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. వార్డులో 1430 మంది ఓటర్లు ఉన్నప్పటికీ తమకు ఓటు హక్కు లేకుండా ఏకగ్రీవం ప్రకటించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆందోళనకారులు వాపోయారు. ఏకగ్రీవ ఎన్నికను వెంటనే రద్దు చేసి, వార్డులో యథావిధిగా ఎన్నికలు నిర్వహించి తమకు ఓటు హక్కు కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఓటు హక్కు కల్పించకపోతే 'మేమంతా చనిపోయినట్టేనని.. ఇందుకోసం మా అందరికీ మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి' అంటూ కాలనీ వాసులు భీష్మంచుకు కూర్చోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ కార్యాలయం వద్దకు కాలనీవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఓటర్ల అపనిందలు..అభ్యర్థి ఆత్మహత్యా యత్నం
17 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసి చివరి నిమిషంలో ఉపసంహరించుకున్న పస్తం మల్లమ్మ బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. డబ్బులు తీసుకొని నామినేషన్ ఉపసంహరణ చేసుకుని వార్డులో ఎన్నికలు లేకుండా చేశావంటూ కాలనీ వాసులు చివాట్లు..అపనిందలు వేయడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. తన ఇంట్లోనే చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది పార్టీ కార్యకర్తలు గమనించి మల్లమ్మ ను ఉరికంబం నుంచి కాపాడారు.






