కాటికి వెళ్లిన కష్టాలేనా..? అస్తవ్యస్తంగా వైకుంఠధామం

by Nallavelli.Anjaneyulu |

భూదాన్ పోచంప‌ల్లి పట్టణ శివారులోని భీమనపల్లి చిన్నేరు వద్ద ఉన్న వైకుంఠధామం అధ్వానంగా తయారైంది.

కాటికి వెళ్లిన కష్టాలేనా..? అస్తవ్యస్తంగా వైకుంఠధామం
X

దిశ, భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీగా మారి ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. అభివృద్ధిలో మాత్రం 'ఎక్కడ వేసిన గొంగడి అక్కడే' అన్న చందంగా మారింది. పట్టణ శివారులోని భీమనపల్లి చిన్నేరు వద్ద ఉన్న వైకుంఠధామం అధ్వానంగా తయారైంది. మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 'కాటికి వెళ్లినా కష్టాలు తప్పవా?' అంటూ పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​కనీస వసతులు కరువు..

వైకుంఠధామం ఆవరణ అంతా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దర్శనమిస్తోంది. కనీసం స్నానాలు చేసేందుకు నీటి సౌకర్యం లేకపోవడంతో, అంత్యక్రియలకు వచ్చిన వారు బయట నుండి నీటిని కిరాయికి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇక మహిళల కోసం కేటాయించిన స్నానపు గదులకు తలుపులు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పట్టించుకోని అధికారులు

​మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యను ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వైకుంఠధామం దుస్థితిపై ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని, కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైకుంఠధామాన్ని బాగు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Next Story