- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బినామీల రాజ్యం… విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ కోలాహలం!
విద్యుత్ సంస్థలో కాంట్రాక్టర్లుగా కొనసాగుతున్న సగానికంటే ఎక్కువ మంది బినామీ లే. అయితే విద్యుత్ సంస్థలో కాంట్రాక్టర్లు అవ్వడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కానీ వాటిని తుంగలో తొక్కి విద్యుత్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల పేర్లతో కాంట్రాక్టర్లుగా కొంతమంది చెలామణి అవుతున్నారు.

దిశ, నల్గొండ బ్యూరో: విద్యుత్ సంస్థలో కాంట్రాక్టర్లుగా కొనసాగుతున్న సగానికంటే ఎక్కువ మంది బినామీ లే. అయితే విద్యుత్ సంస్థలో కాంట్రాక్టర్లు అవ్వడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కానీ వాటిని తుంగలో తొక్కి విద్యుత్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల పేర్లతో కాంట్రాక్టర్లుగా కొంతమంది చెలామణి అవుతున్నారు. ఓ డివిజన్ పరిధిలో గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తుండగా దానికి డివిజన్, మండల స్థాయి అధికారులు వత్తాసు పలుకుతూ కోట్లాది రూపాయలను పక్కదారి పట్టిస్తూ లక్షల్లో కమీషన్లు సంపాదిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదంతా నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ పరిధిలోని విద్యుత్ కార్యాలయంలో జరుగుతుంది. బినామీలే కాంట్రాక్టర్లుగా చలామణి అవుతూ ఆ శాఖలో గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఆ కాంట్రాక్టర్లకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు .
దేవరకొండ విద్యుత్ శాఖ డివిజన్ పరిధిలో పది మండలాలు ఉండగా సుమారు 60 నుండి 70 మంది కాంట్రాక్టర్లు ఇక్కడ పనిచేసే వారు ఉంటారు. ఈ కాంట్రాక్టర్లకు రాష్ట్రవ్యాప్తంగా పనులు చేసుకునే అవకాశం ఉన్న బినామీలు అధికారుల అండదండలతో ఒకే ప్రాంతంలో తిష్ట వేస్తూ మరో కొత్త వ్యక్తులను కాంట్రాక్టర్లుగా రానివ్వకుండా చూసుకుంటూ వారు చేసిందే పని వాళ్లు చెప్పిందే న్యాయంగా కొనసాగిస్తున్న అధికారుల తీరు ఇది.
విద్యుత్ కాంట్రాక్టర్ కు అర్హతలు ..
విద్యుత్ శాఖలో పనిచేసిన అధికారులు ఉద్యోగుల రక్తసంబంధీకులు, ఇతర దగ్గర బంధువులు ఎవరు కూడా విద్యుత్ కాంట్రాక్టర్లుగా ఉండకూడదని నిబంధన ఉంది. కానీ నిబంధనలను తుంగలో తొక్కి సంబంధిత శాఖ లో పనిచేసే ఉన్నతాధికారులు లైన్మెన్లు ఆర్టిజన్లు వారి కుటుంబ సభ్యుల పేర్లతో లైసెన్సులను పొంది ఉద్యోగాలు కూడా చేయకుండా ఉన్నతాధికారులకు కమీషన్లు ఇస్తూ నిత్యం కార్యాలయాల్లో కాంట్రాక్టు పనుల కోసం తిరుగుతూ పెద్ద కాంట్రాక్టర్లుగా చలామణి అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ బినామీ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తడానికి కింది నుంచి పై దాకా అందరి అధికారుల అండదండలు పెద్ద ఎత్తున ఉన్నాయని విమర్శలు ఉన్నాయి.
పనులన్నీ వారికే..
విద్యుత్ సంస్థల్లో పని చేస్తూ వారి కుటుంబాలపై లైసెన్సులు పొంది కాంట్రాక్టులు చేస్తున్న వారికి, అధికారుల బినామీలకు అత్యధికంగా పనులు రావడం గమనార్హం. వీరు నిత్యం ఆ శాఖలో ఉంటుండడంతో అధికారులకు కూడా కమిషన్లు ఇచ్చిపుచ్చుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండకపోవడం దీనికి ఎక్కువగా సహకరిస్తుందని కార్యాలయంలో పని చేసే సిబ్బంది చర్చించుకుంటున్నారు. డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో ఇటీవల విడుదలైన అనేక రకాలైన పనుల్లో చూసుకుంటే దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా 60 నుంచి 70 మంది కాంట్రాక్టర్లకు గాను 20 నుంచి 25 మంది బినామీలు ఉండగా కేవలం వారికి మాత్రమే 70% నుండి 80% పనులు కేవలం బినామీలకు మాత్రమే నామినేటెడ్ పద్ధతుల్లో ఇస్తున్నారు. అధికారులు నిజమైన కాంట్రాక్టర్లకు 20 నుంచి 30 శాతం పనులు మాత్రమే ఇస్తుండడం విడ్డూరంగా ఉందని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ, మాకేం పట్టనట్టు ఉన్నతాధికారులు ఉంటున్నారు.
బినామీల ఫైలు ఎక్కడ ఆగదు
ప్రభుత్వ కార్యాలయంలో పైసలు ఇస్తేనే ఫైలు కదులుతుంది అని అందరికీ తెలిసినప్పటికీ విద్యుత్ శాఖలో మాత్రం సమస్య మరోలా ఉంది. బినామీలుగా చలామణి అవుతున్న కాంట్రాక్టర్లు ఆ శాఖలోని ఏ కార్యాలయానికి వెళ్లిన వారి పనులు కాంట్రాక్టర్ ఫైల్ లో వెంటనే కదిలి పనులు పూర్తవుతాయి. కానీ శాఖలో ఎటువంటి పరిచయాలు లేకుండా కేవలం కాంట్రాక్టర్లు గానే కొనసాగుతున్న వారికి ఫైల్ కదలడానికి నెలలు గడుస్తున్న వాటి దిక్కు చూసే నాథుడే ఉండడు. ఇదేంటది ఎవరినైనా అధికారులు అడిగితే 'మీరు కాంట్రాక్టు ఎలా చేస్తారో చూస్తామని' బెదిరిస్తున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఉన్నత అధికారులకు తెలియకుండానే కొనసాగుతుందా ..?
విద్యుత్ శాఖలో బినామీల అక్రమ పర్వం ఉన్నతాధికారులకు తెలియకుండానే కొనసాగుతుందా.. అంటే.. అందరికీ వాటాలు చేకూరడంతో చూసి చూడనట్టు వదిలేస్తున్నారా అనే అనుమానం వస్తోంది . ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి వివిధ మండలాల్లో ఉన్న కాంట్రాక్టర్లలో వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ఉద్యోగాలు పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలి. అలాగే మండలాల వారిగా ఇప్పటివరకు వచ్చిన పనులు కేటాయించిన కాంట్రాక్టర్లపై పూర్తి విచారణ జరిపించి అధిక మొత్తంలో బినామీ కాంట్రాక్టర్లకు పనులను అప్పగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది.






