యువతిపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి ఏడున్నరేళ్ల జైలు శిక్ష

by Bhanu |   (  Updated:2025-05-14 13:07:16  IST  )

ప్రేమ పేరుతో వేధిస్తూ ఓ యువతిపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి నల్లగొండ జిల్లా ఫ్యామిలీ కోర్టు మూడవ అదనపు న్యాయమూర్తి డి. దుర్గాప్రసాద్ బుధవారం సంచలన తీర్పును వెలువరించారు.

యువతిపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి ఏడున్నరేళ్ల జైలు శిక్ష
X

దిశ, నల్లగొండ క్రైం: ప్రేమ పేరుతో వేధిస్తూ ఓ యువతిపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి నల్లగొండ జిల్లా ఫ్యామిలీ కోర్టు మూడవ అదనపు న్యాయమూర్తి డి. దుర్గాప్రసాద్ బుధవారం సంచలన తీర్పును వెలువరించారు. నిందితుడు మనిమెద్దె సాయిరాం కు ఏడున్నరేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 8,000 జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు.

ఈ కేసు నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాకుల కొండారం గ్రామానికి చెందిన ఓ యువతికి, మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన సాయిసాయిరాం ఫంక్షన్ సందర్భంగా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నుండి యువతిని ప్రేమిస్తున్నానని చెబుతూ అతను వెంటపడసాగాడు. తిరస్కరించినా వదలకుండా వేధింపులకు దిగాడు.

2024 ఆగస్టు 8న, కంచనపల్లిలోని జెడ్పీ హై స్కూల్ వద్ద వ్యక్తిగత పని కోసం వెళ్లిన యువతిని సాయిరాం చున్నీతో గుంజి, కడుపులో గుద్దిన ఘటన జరిగింది. బాధితురాలు వెంటనే నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ సైదాబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరానికి సహకరించినట్లు పేర్కొన్న నందినిపై కూడా కేసు నమోదు అయినప్పటికీ, ఆమెను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

సాక్ష్యాధారాలను, నేర పూర్వాపరాలను నిశితంగా పరిశీలించిన న్యాయమూర్తి మూడు వేర్వేరు సెక్షన్ల కింద సాయిరాంకు శిక్ష విధించారు. కేసు న్యాయపరంగా శీఘ్ర పరిష్కారం కావడంతో పాటు న్యాయం జరగడం పట్ల బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.

కేసు విచారణలో న్యాయం జరిగేలా సహకరించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జవహర్ లాల్, ఎస్‌ఐ సైదాబాబు, టూ టౌన్ సీఐ రాఘరావు, సీడీవో కె. దుర్గారాజు, కోర్టు లైజన్ అధికారులు పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్‌లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story