- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Apaar: విద్యార్థులకు అపార్ కష్టాలు..!
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఇకపై ఆధార్ తరహాలో (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కార్డు తెచ్చేందుకు ఇప్పటికే ఆదేశించింది.

దిశ ,హాలియా: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఇకపై ఆధార్ తరహాలో (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కార్డు తెచ్చేందుకు ఇప్పటికే ఆదేశించింది. ఆయా సంస్థల్లో చదివే విద్యార్థుల అకాడమిక్ ఎక్స్ ట్రా కర్యులర్ రికార్డులను ఒకే చోట సురక్షితమైన డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఏకీకృతం చేయడానికి రూపొందించబడిన ప్రత్యేకమైన 12 అంకెల గుర్తింపు సంఖ్య కలిగినది అపార్ ఐడీ కార్డు. ఇట్టి కార్యక్రమాన్ని ఇప్పటికే అన్ని విద్యాసంస్థల్లో ప్రారంభించారు. ఇందుకుగాను విద్యార్థుల నుంచి ఆయా సంస్థలు ఆధార్ కార్డు ప్రధానంగా వినియోగిస్తున్నారు. ఆధార్ కార్డు లో ఉన్న వివరాలను విద్యార్థి అపార్ ఐడీలో నమోదు చేయనున్నారు. ఇలా చేయడం ద్వారా సంబంధిత విద్యార్థి వివరాలను దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా డిజిటల్ ఆన్లైన్లో వివరాలను తీసుకోవచ్చు.
కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు ఆయా ప్రభుత్వ ,ప్రైవేట్ విద్యాసంస్థలను కేంద్ర మానవ వనరుల శాఖ త్వరితగతిన పూర్తిచేయాలని ఎప్పటికప్పుడు ఆదేశిస్తుంది.దీంతో సంబంధిత విద్యార్థులు ఆధార్ కార్డు లో ఉన్న తప్పులను సరి చేసుకునేందుకు ఆధార్ సెంటర్, మీసేవ సెంటర్ల వైపు పరిగెడుతున్నారు. గత కొన్నేళ్ల క్రితం జనన ధ్రువీకరణ పత్రాలు అడగకుండా కేవలం ఆధార్ కార్డు ప్రామాణికంగా విద్యార్థుల వివరాలను విద్యాసంస్థలు పొందుపరిచాయి. తాజాగా అపార్ ఐబా లో పొందుపరచడం ద్వారా విద్యార్థుల ఆధార్ కార్డులో ఉన్న తప్పులు అనగా పేరులో (పేరు,గ్రామం, రాష్ట్రం, తండ్రి ) తదితర వివరాల్లో తప్పులు సహజంగానే జరిగాయి. దీంతో ఇదే వివరాలను అపార్ ఐబా లో పొందుపరచడం ద్వారా భవిష్యత్తులో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉండడంతో తల్లిదండ్రులు ఆధార్ కార్డులో తప్పులను సరి చేసుకునేందుకు మీ సేవ కేంద్రాలకు పరిగెడుతున్నారు.మీసేవ, ఆధార్ సెంటర్లలో తప్పులను సరి చేసుకునేందుకు జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని తెలపడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
జనన ధ్రువీకరణ పత్రానికి రూ.2వేల నుంచి రూ.8వేల వరకు డిమాండ్
విద్యాసంస్థల్లో అపార్ ఐడీలో వివరాలను నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డు ప్రామాణికంగా వివరాలను నమోదు చేయడంతో అసలు సమస్య ఏర్పడింది. గతంలో ఆధార్ కార్డులో ఉన్న వివరాలు సరిలేక పోవడంతో ఆధార్ కార్డులో తప్పులను సరి చేయాలంటే జనన ధ్రువీకరణ పత్రం అడుగుతున్నారు. దీంతో దళారుల పంట పండింది. విద్యార్థులు నర్సరీ నుంచిపదవ తరగతి వరకు ధ్రువీకరణ పత్రాలు తీసుకునే విద్యార్థుల నుండి రూ 2వేల నుంచి రూ.8వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.ప్రధానంగా జనన ధ్రువీకరణ పత్రాలు ఆయా మున్సిపాలిటీ కేంద్రాలు, గ్రామపంచాయతీల్లో ఇవ్వాల్సి ఉండగా ఇట్టి పత్రాలకు సంబంధిత సిబ్బంది పెద్ద ఎత్తున డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. నేరుగా తల్లిదండ్రుల వద్ద కాకుండా సంబంధిత శాఖల అధికారులు కొంతమంది మధ్య దళాల ద్వారా డబ్బులను తీసుకుంటున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకుగాను తరగతికి ఓ రేటు నిర్ణయించి తల్లిదండ్రుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు.
హాలియా పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు జనన ధ్రువీకరణ పత్రాల కోసం హాలియా, మిర్యాలగూడ మున్సిపాలిటీలతో పాటు ఆయా గ్రామపంచాయతీలో పత్రాలు పొందాల్సి ఉంది. దీంతో ఆయా శాఖల అధికారులు అంది వచ్చిన అవకాశంగా భావిస్తూ విద్యార్థుల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అపార్ ఐడీ కార్యక్రమం ప్రారంభం కావడంతో దళారుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అన్న చందంగా వెలుగుతుంది. గతంలో ఆధార్ కార్డులో తప్పులను సరి చేసుకునేందుకు బోనఫైడ్, రెసిడెన్స్ సర్టిఫికెట్ ను తీసుకున్నప్పటికీ ప్రస్తుతం జనన ధ్రువీకరణ పత్రం మాత్రమే కావాలని ఆధార్, మీసేవ కేంద్రాల్లో కోరడంతో తప్పడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో విద్యార్థుల ఆధార్ లో తప్పులను విద్యార్థులకైతే కేవలం ఆయా పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్ ద్వారానే సరి చేసేవారు. ఇప్పుడు మాత్రం జనన ధ్రువీకరణ పత్రం కావాలని డిమాండ్ చేస్తుండడంతో ఆధార్ మీసేవ కేంద్రాల వద్ద తల్లిదండ్రులు బారులు తీరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా సాధారణ చలానా ద్వారానే సర్టిఫికెట్లు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
- Tags
- Apaar
- Telugu News






