వ్యవసాయం ఒక విజ్ఞానం.. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

by Ratna Kumari |   (  Updated:2026-01-23 13:27:49  IST  )

"వ్యవసాయం ఒక విజ్ఞానమని" ఇప్పటివరకు ఉన్న జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం ప్రస్తుతం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ , జై అనుసంధాన్ గా మారిందని తెలంగాణ‌ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.

వ్యవసాయం ఒక విజ్ఞానం.. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
X

దిశ, హుజూర్ నగర్ : "వ్యవసాయం ఒక విజ్ఞానమని" ఇప్పటివరకు ఉన్న జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం ప్రస్తుతం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ , జై అనుసంధాన్ గా మారిందని తెలంగాణ‌ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా, మఠంపల్లి మండలం, మట్టపల్లి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు,అధికారులు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేశారు.దేవాలయ ఆవరణలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించి లబ్ధిదారులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఆ తర్వాత వేదిక వద్ద హుజూర్ నగర్ సమీపంలోని ముగ్దుమ్ నగర్ వద్ద 100 ఎకరాలలో 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేశారు. కోదాడ సమీపంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయానికి శంకుస్థాపన చేయడమే కాక, మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న యాత్రికా సదన్, నూతన కిచెన్ షెడ్ కు, మరో కోటి రూపాయల వ్యయంతో నిర్మించే డార్మెటరీ బిల్డింగులకు శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ వసంత పంచమి రోజున పవిత్ర కృష్ణానది తీరాన ఉన్న మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం సంతోషమని అన్నారు. అలాగే రైతులకు ఉపయోగపడే వ్యవసాయ కళాశాలకు, విద్యార్థులకు ఉపయోగపడే నవోదయ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. "వ్యవసాయం ఒక విజ్ఞానమని", ఇంతకు పూర్వం దేశంలో జై జవాన్, జై కిసాన్, నినాదం ఉండేదని, ఆ తర్వాత జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం వచ్చిందని,ప్రస్తుతం ఇది జై జవాన్ ,జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ గా మారిందని తెలిపారు. గంగ ,యమునా, సరస్వతి లాగే కృష్ణ, గోదావరి, కావేరి నదులు ఉండడం, మట్టపల్లిలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున వ్యవసాయం సాగు చేయడం, ప్రత్యేకించి పామాయిల్ పెంపకం చేపట్టడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర గవర్నర్ రైతులకు 2కోట్ల 47 లక్షల రూపాయల విలువ చేసే వ్యవసాయ యంత్ర పరికరాల ప్రోసీడింగ్స్ ను అందజేశారు. అంతేకాక స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద 504 కోట్లు, ఆదాయ వనరుల ను పెంపొందించేందుకు మరో 89 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు.

Next Story