- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బడి కోసం విద్యార్థిగా మారిన గురువు..
ప్రభుత్వ పాఠశాల మనుగడ కోసం ఓ ఉపాధ్యాయుడు వినూత్న ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది.

దిశ, మర్రిగూడ: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంచి, విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ఓ ఉపాధ్యాయుడు చేస్తున్న వినూత్న ప్రయత్నం అందరి ప్రశంసలు అందుకుంటోంది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు లెంకలపల్లి వెంకటేశ్వర్లు, తన పాఠశాల అభివృద్ధి కోసం అసాధారణమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల ఆకర్షణతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో, బడిని కాపాడుకోవాలనే సంకల్పంతో వెంకటేశ్వర్లు స్వయంగా విద్యార్థి యూనిఫామ్ ధరించి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫామ్‌లు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య, మౌలిక వసతులు వంటి అంశాలను వివరించే ఫ్లెక్సీ బ్యానర్‌ను ధరించి తల్లిదండ్రులను కలుస్తున్నారు.
అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు కూడా..
“మా ఊరి బడి బతికితేనే గ్రామ భవిష్యత్తు బాగుంటుంది” అనే సందేశంతో ఆయన చేస్తున్న ప్రచారం గ్రామస్థులను ఆలోచింపజేస్తోంది. ఒక ఉపాధ్యాయుడు తన బాధ్యతను ఉద్యోగంగా కాకుండా సామాజిక కర్తవ్యంగా భావించి చేస్తున్న ఈ కృషి పట్ల తల్లిదండ్రులు, విద్యావేత్తలు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర్ల ప్రయత్నం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు కూడా చొరవ చూపితే అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఆయన నిరూపిస్తున్నారని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక గురువు సంకల్పం, ఒక పాఠశాల భవిష్యత్తును మార్చగలదనే విషయాన్ని రాంరెడ్డిపల్లి ఉపాధ్యాయుడు లెంకలపల్లి వెంకటేశ్వర్లు తన వినూత్న ‘బడిబాట’తో చాటి చెబుతున్నారు.






