తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధంగా బహుజన వర్కర్స్ యూనియన్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

by Kodari Anjali |

తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనుబంధంగా బహుజన వర్కర్స్ యూనియన్ (బీడబ్ల్యూయూ) పనిచేస్తుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధంగా బహుజన వర్కర్స్ యూనియన్:  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
X

దిశ, రాంనగర్: తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనుబంధంగా బహుజన వర్కర్స్ యూనియన్ (బీడబ్ల్యూయూ) పనిచేస్తుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం బాగ్‌లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం సుద్దాల సురేష్ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా బహుజన వర్కర్స్ యూనియన్ పోరాటాలు చేస్తోందని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ యూనియన్ ఏర్పాటైందని తెలిపారు. "విలీనం ముద్దు – ఎన్నికలు వద్దు" అనే నినాదంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంస్థ కృషి చేస్తోందన్నారు. ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా కాకుండా ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బీడబ్ల్యూయూ ఇకపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగానికి అనుబంధంగా కొనసాగుతుందని తెలిపారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే..

హైదరాబాద్‌ కే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపో లలో యూనియన్‌ ను విస్తరించి, బహుజన వర్కర్స్ యూనియన్ జెండాను ఎగురవేస్తామని చెప్పారు. ఒకవేళ ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు విలీన ప్రక్రియ పూర్తికాకముందే జరిగితే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఎన్నికల బరిలో దిగుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. చైర్మన్‌ గా సంపత్ ముదిరాజ్, అధ్యక్షుడిగా సాజిద్, ప్రధాన కార్యదర్శిగా సుద్దాల సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్ (మియాపూర్-1 డిపో), మహిళా ప్రతినిధులుగా గౌతమి, యాదమ్మ, పార్వతమ్మలను నియమించినట్లు వెల్లడించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల స్ఫూర్తితో బహుజన వర్కర్స్ యూనియన్‌ను ఏర్పాటు చేశామని మల్లన్న తెలిపారు. జూలై 5న "రాజ్యాధికార సమరభేరి" నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా యూనియన్ విస్తరణ పూర్తి చేసి, అనంతరం ఆర్టీసీ కార్మికులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యంబిటి పార్టీ ప్రధాన ప్రతినిధిఅమ్జదుల్లా ఖాన్,తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వేములవాడ మదన్ మోహన్ పాల్గొన్నారు. పార్టీ కార్మిక శాఖకు అనుబంధంగా బహుజన వర్కర్స్ యూనియన్ పనిచేస్తుందని ఆయన తెలిపారు.

Next Story