బిల్లులు మహాప్రభో...!

by velandi.Saikiran |   (  Updated:2025-11-17 21:25:28  IST  )

మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పనులు పూర్తిచేసి ఏడాదిన్నర కాలం పూర్తి కావస్తున్న కాంట్రాక్టర్లకు

బిల్లులు మహాప్రభో...!
X

దిశ, నల్లగొండ బ్యూరో: మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పనులు పూర్తిచేసి ఏడాదిన్నర కాలం పూర్తి కావస్తున్న కాంట్రాక్టర్లకు పైసా బడ్జెట్ విడుదల కాక, ఇచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ లు చెల్లించలేక లబోదిబోమంటున్నారు. అంతేకాకుండా ముందస్తుగానే కమీషన్లు అందినప్పటికీ అధికారులు కనీసం మానవత్వం చూపించకుండా బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అన్ని స్థాయిల్లో అధికారులకు ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ కాంట్రాక్టర్లు గోడు వినిపించిన పట్టించుకునే దిక్కు లేకపాయే.

2023-- 24 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ డిజాస్టర్ రిలిఫ్ ఫండ్ ( NDRF) కింద కేంద్ర ప్రభుత్వం నల్లగొండ కలెక్టర్ ద్వారా మున్సిపాలిటీకి రూ. కోటి రూపాయలను మంజూరు చేసింది. ఆ క్రమంలోనే 11-9-2025న వరద నివారణ చర్యలు చేయాలని నాటి కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే పట్టణంలో దాదాపు 27 వార్డుల్లో అవసరాన్ని బట్టి రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వార్డులకు కేటాయించారు . అంతేకాకుండా నల్లగొండ మున్సిపాలిటీలోని అమ్మ ఆదర్శ పాఠశాల గ్రాంట్ నిధులతో కనీస వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ క్రమంలోనే 33 పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అధికారులకు వచ్చిన మొదటిలోనే అప్పగించింది. అయితే మొత్తం కోటి రూపాయల బడ్జెట్ తో 33 పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు నిర్ణయం తీసుకొని పనులు చేపట్టారు. పనులు ప్రారంభ దశలోని ప్రతి కాంట్రాక్టర్కు రూ.60- 70వేలు అడ్వాన్స్ గా అందజేశారు.

పనులు పూర్తయినా....

నల్లగొండ మున్సిపాలిటీలో ఎన్ డి ఆర్ ఎఫ్, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తయి దాదాపు 20 నెలలు దాటింది. కానీ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఒక రూపాయి కూడా బిల్లులు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా బిల్లులు వచ్చినప్పటికీ కేవలం నల్లగొండ జిల్లాలోని బిల్లులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందుల గురి చేస్తున్నట్లు సమాచారం. స్థానిక అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులు అందరూ వరకు కూడా బిల్లులు ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం మానవత్వం కూడా చూపించలేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ లు చెల్లించలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీ కేంద్రాల్లో జరిగిన పనులకు కూడా బిల్లులు విడుదల చేశారు.. కానీ స్వయంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గ కేంద్రమైన నల్లగొండ మున్సిపాలిటీ పనులకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడం ఆశ్చర్యాన్ని గురిచేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టోకెన్ పెండింగ్ లో ఉంది..::

సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ నల్లగొండ

ఎన్డిఆర్ఎఫ్ నిధులు విడుదల కావడానికి బిల్లులు చేసి ప్రభుత్వాన్ని పంపించాం. డిపార్ట్మెంట్లో టోకేన్ పెండింగ్ లో ఉంది. ఇక అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధం లేదు.

Next Story