- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటు కోసం 12 కి.మీ. ట్రాక్టర్ పై ప్రయాణం
దిశ, తుంగతుర్తి : రెండు కాదు మూడు కాదు.. ఏకంగా 12 కి.మీ దూరం నుంచి ట్రాక్టర్ పై ప్రయాణించి ఓటు హక్కును వినియోగించుకున్నారు కర్నాలకుంట, సంధ్య

దిశ, తుంగతుర్తి : రెండు కాదు మూడు కాదు.. ఏకంగా 12 కి.మీ దూరం నుంచి ట్రాక్టర్ పై ప్రయాణించి ఓటు హక్కును వినియోగించుకున్నారు కర్నాలకుంట, సంధ్య తండ గిరిజనులు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ పరిధిలో కర్నాలకుంట, సంధ్య తండాలు ఉంటాయి. ఈ రెండు గ్రామాల దూరవ్యవధి రెండు కి.మీ లోపే.అయితే గొట్టిపర్తి~ కర్నాలకుంట, సంధ్య తండ ప్రాంతాల మధ్య ఉన్న పాలేరు వాగు గత కొన్ని దశాబ్దాల కాలంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోతుంటాయి. ఒకవేళ ధైర్యం చేసి నడకతో రాకపోకలు సాగించాలంటే కేతిరెడ్డివాగు మత్తడే శరణ్యం. దాని మీదుగా నడుచుకుంటూ గొట్టిపర్తికి రావాల్సి ఉంటుంది.ఒక్కోసారి అక్కడ ఏర్పడ్డ పరిస్థితులతో జారిపడి తీవ్ర గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. అయితే గొట్టిపర్తి~పోచారం (వాగు ఆవల,జనగామ జిల్లా) మధ్య గత రెండేళ్ల క్రితం వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమై నీటి నిల్వలతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. అయితే కర్నాలకుంట, సంధ్య తండా గిరిజనులు కొన్ని సందర్భాలలో కేతిరెడ్డి వాగు మత్తడి దాటే పరిస్థితులు అనుకూలించక పోవడంతో చివరికి జనగామ జిల్లా పోచారం~కొత్తపెళ్లిమీదుగా సూర్యాపేట జిల్లా మావిడాల~జలాల్ పురం గ్రామాల మీదుగా గొట్టిపర్తికి రావాల్సి ఉంటుంది. అంటే చుట్టూ తిరుగుతూ 12 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ లెక్కన సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే నిమిత్తం కర్ణాలకుంట, సంధ్య తండకు చెందిన 12వ వార్డులో ఉన్న 140 మంది ఓటర్లు రెండు ట్రాక్టర్ల మీద గొట్టిపర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరి అందులో ఏర్పాటైన పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఇలా ఉంటే తుంగతుర్తి మండలంలోని బాపనిబావి తండ పరిధిలో భారతి తండా ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య 4 కి.మీ దూరం ఉంది. భారతి తండాలో ఉన్న 5, 6 వార్డుల్లో 70 ఓటర్లు ఉండగా ఏకగ్రీవం అయ్యాయి. వీరంతా కేవలం సర్పంచ్ ఓటు హక్కు కోసం ట్రాక్టర్ ఫై రోడ్డు మార్గాన గొట్టిపర్తి క్రాస్ రోడ్డు మీదుగా 4 కి.మీ ప్రయాణించి బాపనిబావి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటైన పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.






