నల్లగొండ నేతలే రేవంత్‌పై తిరుగుబాటు చేస్తారు: సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు

by Kema Shiva Kumar |

కొద్దిరోజుల్లోనే నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తారని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

నల్లగొండ నేతలే రేవంత్‌పై తిరుగుబాటు చేస్తారు: సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొద్దిరోజుల్లోనే నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తారని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌కు ఇప్పటికే అభద్రతా భావం మొదలైందని అన్నారు. ఆయనకు కేబినెట్ మంత్రులే ఎవరూ సహకరించట్లేదని హరీశ్ వ్యాఖ్యానించారు.

ప్రజల సమస్యలు పరిష్కరించమంటే రేవంత్ గేట్లు తెరిచామని చెబుతున్నారని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డి గేట్లు తెరిచింది రైతులు, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఏమాత్రం కాదని ఆయన చెప్పారు. రేవంత్‌కు తమ ఎమ్మెల్యేలను టచ్ చేసే దమ్ము, ధైర్యం లేదని, ఆయనకు దమ్ముంటే టచ్ చేసి చూడాలని, పరిస్థితి ఎలా ఉంటుందో తాము కూడా చూపిస్తామని హరీశ్‌బాబు హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి ఎంతసేపు తనను చూడండి.. 100 రోజుల పాలన చూడండి అని ఓట్లు అడుగుతున్నారని, రాహుల్ గాంధీని చూపించి ఓట్లు అడిగే దమ్ము రేవంత్‌కు ఉందా.. అని హరీశ్‌బాబు ప్రశ్నించారు.

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందని, తుక్కుగూడ సభతో ఇది తెలిసిపోయిందని హరీశ్ బాబు ఎద్దేవా చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసేది 250 సీట్లలోనేనని, ఇతర స్థానాలు.. అలయెన్స్ పెట్టుకున్న పార్టీలకు ఇచ్చిందని ఆయన చెప్పారు. ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌కు డబుల్ డిజిట్ రాదని ఆయన వెల్లడించారు. న్యాయ పత్రం తీసుకొచ్చారు సరే.. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన సమయంలో ఎందుకు ప్రజలకు న్యాయం చేయలేదో సమాధానం చెప్పాలని హరీశ్ బాబు ప్రశ్నించారు.

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నారని, మరి ఇవ్వాళ్టికి 126వ రోజని, ఇంకెప్పుడు హామీలు అమలుచేస్తారని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంశం డీజీపీకి తెలియకుండానే జరిగిందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు తమకు ఇష్టమైన వారిని దొరలుగా.. ఇష్టం లేని వారిని దొంగలుగా చూపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ కోతలు, తాగునీటి కష్టాలు, కరువు కాటకాలను తెచ్చిందని రైతులు, ప్రజలంతా చెబుతున్నారని హరీశ్ బాబు వ్యాఖ్యానించారు.

రూ.20 లక్షలు.. ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వండి

ఇకపోతే.. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఒక ఏనుగు వచ్చి ఇద్దరి ప్రాణాలు తీసినా అటవీ శాఖ అధికారులు పట్టించుకోలేదని హరీశ్ బాబు ఆవేదన వ్యక్తంచేశారు. అధికారుల వైఫల్యం వల్ల ఇద్దరు రైతులు మరణించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం, మంత్రి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరు మరణించినా కలెక్టర్, ఎస్పీ కూడా పట్టించుకున్న పాపానపోలేదని ధ్వజమెత్తారు.

గతంలో పెద్దపులి దాడిలోనూ పలువురు మరణించారని, భరోసా నింపాల్సిన ప్రభుత్వం, అధికారులు ఎలాంటి పట్టింపు లేకుండా వ్యవహరిస్తే ఎలా అని ఫైరయ్యారు. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ప్రకటించారని, కానీ పక్క రాష్ట్రం మహారాష్ట్రలో రూ.20 లక్షలు ఇస్తున్నారని పాల్వాయి హరీశ్ బాబు గుర్తుచేశారు. అక్కడిలాగే ఇక్కడి మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలతో పాటు ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story