నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడికి తీవ్ర అవమానం.. మంత్రి కోమటిరెడ్డిపైనే అనుమానం!?

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-12-31 11:41:10  IST  )

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది.

నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడికి తీవ్ర అవమానం.. మంత్రి కోమటిరెడ్డిపైనే అనుమానం!?
X

దిశ, నల్లగొండ బ్యూరో : నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడికి తీవ్ర అవమానం జరిగింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆయనను వేదికపైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. నాయకులను అందరినీ పంపించి ఆయనను మాత్రమే అడ్డుకోవడం.. ఆ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొనడంతో ఇది కుట్రగా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే..

చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఓ టీవీ రిపోర్టర్ తండ్రి దశ దినకర్మకు డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస నేత హాజరయ్యారు. కొద్దిసేపటికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి అక్కడికి వచ్చారు. కైలాస్ నేత సాదరంగా వారిని ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా రిపోర్టర్ తండ్రి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించేందుకు మంత్రితోపాటు గుత్తా సుఖేందర్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి తదితర నేతలు వేదిక పైకి వెళ్లారు. ఆ క్రమంలోని వారితోపాటు వెళ్తున్న డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస నేతను స్థానిక సీఐ ఆదిరెడ్డి అడ్డుకొని మీరు అక్కడికి వెళ్లొద్దని అభ్యంతరం చెప్పి పక్కకు నెట్టేసినట్లు సమాచారం.

ప్రభుత్వ కార్యక్రమం కానప్పటికీ ఎందుకు నన్ను మాత్రమే పక్కకు తోసేస్తున్నారని ప్రశ్నించినా.. సమాధానం చెప్పకుండా పోలీస్ అధికారులు కొంత ఘాటుగా వ్యవహరించినట్లు తెలిసింది. పున్న కైలాస నేతను సీఐ అడ్డుకోవడం వెనక మంత్రి హస్తం ఉన్నట్లు అక్కడ చర్చ జరిగింది. అదే లేకపోతే ప్రైవేట్ కార్యక్రమంలో అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. పున్న కైలాస్ నేతకు జిల్లా అధ్యక్ష పదవి వచ్చినప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అవమాన పరుస్తున్నట్టు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అది ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు... అటు ప్రభుత్వ కార్యక్రమం కాదు... ఒక ప్రైవేట్ ఫంక్షన్‌లో సొంత పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడిని ఇంత ఘోరంగా అవమానించి, పోలీసులతో జులుం చూపించడం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనపై కావాలనే జరుగుతున్న కుట్రలో పోలీసులు కూడా అత్యుత్సాహం చూపించారని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story