- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యం? ఎన్.రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు
జీహెచ్ఎంసీ పరిధిని పెంచేందుకు, గ్రేటర్ బయట ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను జోడించి జీహెచ్ఎంసీలో విలీనం చేసి మహానగరంగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిని పెంచేందుకు, గ్రేటర్ బయట ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను జోడించి జీహెచ్ఎంసీలో విలీనం చేసి మహానగరంగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు చెప్పారు. శుక్రవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం డీసెంట్రలైజేషన్ అవసరం కానీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సెంట్రలైజేషన్ నిర్ణయం ప్రజలకు నష్టం చేస్తుందన్నారు. జీహెచ్ఎంసీలో విలీనం చేసినట్లయితే 2 కోట్లకు పైగా జనాభా గ్రేటర్ పరిధిలోకి వస్తుందని.. ఇంత పెద్ద జనాభా నిర్వహణకు అవసరమైన సదుపాయాలు లేవని.. పైగా ప్రజలపై పన్నుల భారం పెరుగుతుందని చెప్పారు. గతంలో ఎంసీహెచ్ ఉండేదని.. దాన్ని జీహెచ్ఎంసీగా మార్చారని.. అప్పట్లో కొన్ని గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీల్లో జోడించి, ఆ మున్సిపాలిటీలను మళ్లీ కలిపారని తెలిపారు. ఏడాది క్రితమే మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చిన గ్రామీణ ప్రాంతాలను ఇప్పుడు జీహెచ్ఎంసీలో జోడించడం వల్ల ప్రజలకు మరింత నష్టం జరగనుందని ఆరోపించారు. గతంలో ఎంసీహెచ్ నుంచి జీహెచ్ఎంసీగా మార్చినప్పుడు, బంజారాహిల్స్‌లో ట్యాక్స్‌స్ట్రక్చర్ తక్కువగా ఉండగా, మల్కాజ్‌గిరిలో ఎక్కువ పన్నులు విధించారని.. జీహెచ్ఎంసీలో కొత్తగా కలిసిన ప్రాంతాల ప్రజలపై అధిక పన్నుల భారం పడిందన్నారు. ఇప్పుడు కూడా విలీనంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఇలాంటి పన్ను భారం మరింత పెరగనుందన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో నిధుల కొరత తీవ్రంగా ఉన్నదని.. మున్సిపాలిటీల్లో అభివృద్ధి లేదని.. విలీనం చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
విలీనం అయితే మున్సిపాలిటీల్లో అభివృద్ధి ఎలా?
ప్రస్తుతం మున్సిపాలిటీల్లో అపరిశుభ్రత వాతావరణం నెలకొన్నది.. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నదని.. డ్రైనేజ్ సమస్యలు, చెత్త నిర్వహణలో వైఫల్యం చెందారని రాంచందర్‌రావు ఆరోపించారు. అలాగే.. స్ట్రీట్ లైట్లు, వాటర్ వర్క్స్‌లో నిర్లక్ష్యం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీలు అభివృద్ధి చేయలేనప్పుడు జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం వల్ల పరిస్థితి ఎలా మెరుగుపడుతుందని నిలదీశారు. హైదరాబాద్ నగరాన్ని మహానగరంగా మార్చాలనే నిర్ణయంతో ఇక్కడ ఇప్పటికే ఉన్న 1.70 కోట్ల జనాభా 2 కోట్లకు పైగా పెరిగి, పరిపాలన పూర్తిగా క్లిష్టతరమవుతుందని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేసినట్లు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తున్నదని తెలిపారు. మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు విలీనం చేసే ముందు ప్రజల అభిప్రాయాలు తీసుకోవాల్సింది పోయి ఎవరి ఒపీనియన్ లేకుండా, ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టకుండా, కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకోవడం అర్థరహితమని అన్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ పాలన కన్నా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తున్నదని ఆరోపించారు.
అందుకే హిల్ట్ పాలసీని తీసుకువచ్చి ఏకంగా 9 వేల ఎకరాలకు పైగా భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్‌ను ‘రెడ్ ఎస్టేట్‌గా మార్చాలనుకుంటున్నదని.. ప్రజలను కన్నీళ్లు పెట్టించే నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదని సూచించారు. గతంలో హైడ్రా, మొన్న హిల్ట్ పాలసీ, ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం.. ఇవన్నీ ప్రజలకు నష్టం చేకూర్చేవేనని.. వీటన్నింటినీ బీజేపీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్ ఎన్‌వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.






