కేంద్రంపై నిరాధార ఆరోపణలు మానుకోవాలి.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Taduka Kalyani |

తెలంగాణ రైతుల పేరుతో కేంద్ర ప్రభుత్వంపై అనవసర రాజకీయాలు చేయడం మానుకోవాలని మెదక్ ఎంపీ హెచ్చరించారు.

కేంద్రంపై నిరాధార ఆరోపణలు మానుకోవాలి.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,తూప్రాన్ : తెలంగాణ రైతుల పేరుతో కేంద్ర ప్రభుత్వంపై అనవసర రాజకీయాలు చేయడం మానుకోవాలని, వడ్లు–బియ్యం కొనుగోళ్ల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఎం. రఘునందన్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటుగా హెచ్చరించారు. ఆదివారం తూప్రాన్ మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ చందా అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశామని చెబుతుండగా, వాటి నుంచి ఎంత బియ్యం వస్తుందో కూడా ముఖ్యమంత్రికి తెలియదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేసిన రఘునందన్ రావు, అలాంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు వడ్లు పోస్తామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం రాజకీయ ప్రగల్భాలేనని విమర్శించారు.

“కిషన్ రెడ్డి ఇంటి ముందు వడ్లు పోస్తే... మేమూ సిద్ధమే”

ముఖ్యమంత్రి నివాసం నుంచి కిషన్ రెడ్డి ఇల్లు ఎంత దూరంలో ఉందో, కిషన్ రెడ్డి ఇంటి నుంచి సీఎం నివాసం కూడా అంతే దూరంలో ఉంటుందని పేర్కొంటూ, “మేము తలుచుకుంటే రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా వడ్లు పోయగలం. మా పది మంది కార్యకర్తలు వెయ్యి మందితో సమానం” అని సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్, కౌన్సిలర్లు చందా అశోక్,పార్టీ అధ్యక్షుడు జానకి రామ్ గౌడ్,చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story