సైబర్‌ బాధితులకు పోలీస్ శాఖ భారీ ఊరట

by Naga Rani Yarlagadda |

సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుని, కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకున్న బాధితులకు తెలంగాణ పోలీస్ శాఖ భారీ ఊరటనిచ్చింది.

సైబర్‌ బాధితులకు పోలీస్ శాఖ భారీ ఊరట
X

దిశ, తెలంగాణ బ్యూరో: సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుని, కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకున్న బాధితులకు తెలంగాణ పోలీస్ శాఖ భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా ఏకంగా రూ.45.21 కోట్లను బాధితులకు తిరిగి ఇప్పించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, బ్యాంకులు, డిజిటల్ పేమెంట్ ప్రొవైడర్లు, వివిధ పోలీసు విభాగాల సమన్వయంతో చేపట్టిన ఈ మెగా డ్రైవ్‌లో 6,303 మంది బాధితులు తమ నగదును తిరిగి పొందారు. పౌరుల రక్షణ, బాధితుల కేంద్రంగా రికవరీ వ్యవస్థల బలోపేతమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖా గోయల్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

అత్యధికంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.21.91 కోట్లు

యూపీఐ మోసాలు,ఇన్వెస్ట్‌మెంట్‌ స్కామ్‌ల, అధికారులమంటూ భయపెట్టే ఇంపర్సనేషన్ వంటి డిజిటల్ నేరాల్లో డబ్బులు పోగొట్టుకున్న వారిని గుర్తించి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, బ్యాంకుల సమన్వయంతో ఈ రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేశారు. తాజా లోక్‌ అదాలత్‌లో అత్యధికంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2,232 మంది బాధితులకు రూ.21.91 కోట్లు తిరిగి ఇప్పించి మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత టీజీసీఎస్‌బీ నేరుగా 77 మంది బాధితులకు రూ.6.83 కోట్లు, మల్కాజిగిరి పరిధిలో 779 మందికి రూ.4.04 కోట్లు, హైదరాబాద్ పరిధిలో 755 మందికి రూ.3.22 కోట్లు, సంగారెడ్డిలో 167 మందికి రూ.1.69 కోట్లను రీఫండ్ చేశారు.

లోక్‌ అదాలత్‌ల ద్వారా సైబర్ బాధితులకు రూ.445.41 కోట్లు

తెలంగాణలో సైబర్ నేర బాధితులకు నష్టపరిహారం అందించే వ్యవస్థ ఎంత పటిష్టంగా, సంస్థాగతంగా పనిచేస్తోందో చెప్పడానికి ఇప్పటివరకు జరిగిన రికవరీ గణాంకాలే నిదర్శనమని అధికారులు తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ లోక్‌ అదాలత్‌ల ద్వారా ఏకంగా 59,953 మంది సైబర్ బాధితులకు ఏకంగా రూ.445.41 కోట్లు తిరిగి ఇప్పించడం విశేషం. ఏడాదుల వారీగా చూస్తే.. 2023లో రూ.8.36 కోట్లు, 2024లో రూ.183.9 కోట్లు, 2025లో రూ.182.95 కోట్లు, ఈ ఏడాది రూ.70.07 కోట్ల మేర రికవరీ చేసి బాధితుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా బ్యూరో తన సత్తా చాటుకుంది.

సైబర్ మోసానికి గురైతే తొలి గంట లోపు 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు, పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని హెచ్చరించారు. కస్టమర్ కేర్ నంబర్లను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే తీసుకోవాలని, ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈమెయిల్స్‌కు వచ్చే అనుమానాస్పద లింక్‌లను పొరపాటున కూడా క్లిక్ చేయవద్దన్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్ తొలి గంట లోపు 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, డబ్బును ఫ్రీజ్ చేసి తిరిగి రాబట్టే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.

Next Story