మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు DPR ఆలస్యం..! తలనొప్పిగా ‘మెయిన్ హార్ట్ ఏజెన్సీ’ తీరు

by Kema Shiva Kumar |

సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి.

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు DPR ఆలస్యం..! తలనొప్పిగా ‘మెయిన్ హార్ట్ ఏజెన్సీ’ తీరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. మెయిన్ హార్ట్ ఏజెన్సీ మొండికేయడంతో డీపీఆర్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఆరు నెలలైనా డీపీఆర్ కు సంబంధించి ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వకపోగా.. బిల్లులు ఇవ్వడం లేదంటూ ఇంజినీరింగ్ అధికారులపై ఆ సంస్థ.. సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో సీఎంకు సమాధానం చెప్పలేక, ఆ సంస్థతో పనులు చేయించుకోలేక అధికారులు సతమతమవుతున్నట్టు చర్చ జరుగుతున్నది.

ఆరు నెలలైనా అందని ప్రాథమిక రిపోర్ట్

బ్లూ, గ్రీన్, భూమి ఉపయోగ మాస్టర్ ప్లాన్స్, ల్యాండ్ మార్క్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్స్ ఆధారంగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తుది డీపీఆర్ తయారుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డీపీఆర్ రూపకల్పన కోసం మెయిన్ హార్ట్ ఏజెన్సీతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) 2024 డిసెంబర్ 4న ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 18 నెలల సమయం ఇచ్చింది. నెల రోజుల్లో ప్రాథమిక రిపోర్టు ఇవ్వాలని అగ్రిమెంట్ జరిగిందని అధికారులు చెబుతున్నారు. 55 కిలోమీటర్ల మూసీ పరివాహక ప్రాంతంతోపాటు, నదిలోకి వరద ప్రవాహం వచ్చే ప్రాంతాలు, ప్రభావితమయ్యే లోతట్టు ప్రాంతాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని డీపీఆర్ తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే మెయిన్ హార్ట్ ఏజెన్సీ ఆధ్వర్వంలో సర్వే పనులు ఆశించిన స్థాయిలో జరగడంలేదని అధికారులు చెబుతున్నారు. ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వకపోవడం.. ఇక పూర్తి స్థాయి డీపీఆర్ ఇవ్వడానికి ఈ సంస్థ ఎంత సమయం తీసుకుంటుందోననే విమర్శలు వస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన ఏజెన్సీ తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆఫీసు కూడా లేకపోవడంతో..

మూసీ పునరుజ్జీన ప్రాజెక్టు డీపీఆర్ తయారీ కాంట్రాక్టు దక్కించుకున్న మెయిన్ హార్ట్ ఏజెన్సీకి ఆఫీసుతోపాటు కాంటాక్ట్ చేయడానికి ప్రత్యేక పర్సన్ కూడా లేకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఇంతకుముందు గచ్చిబౌలిలో ఆఫీసు ఏర్పాటు చేసినా.. అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయించినట్టు తెలిసింది. దీంతోపాటు ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తి అమెరికా నుంచి అప్పుడప్పుడు వచ్చిపోతున్నట్టు సమాచారం. ఇంత పెద్ద ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేస్తున్న ఏజెన్సీ.. సంబంధిత ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.

అధికారుల తీరుపై సైతం విమర్శలు..

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. అందుకు అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమనే విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టు పనులు లంగర్ హౌస్ ఏరియాలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. చాదర్ ఘట్, మలక్ పేట్ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్లను ఖాళీ చేయించడం అప్పుడు విమర్శలకు దారితీసింది. ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు మారారు. ప్రస్తుతం మూడో వ్యక్తి ఉన్నారు. దీంతోపాటు ఇతర అధికారులున్నా.. ఆశించిన స్థాయిలో మూసీ పునరుజ్జీవ పనులు జరగడంలేదని ప్రచారం జరుగుతున్నది. అధికారుల తీరు, కాంట్రాక్టు ఏజెన్సీ నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Next Story