Musi Rejuvenation: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు.. కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-31 11:00:54  IST  )

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నది.

Musi Rejuvenation: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు.. కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవనం (Musi Rejuvenation Project) ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ కీలక సమీక్షా సమావేశం నిర్వహించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka), మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా ప్రాజెక్టు పురోగతి, ప్రజల భాగస్వామ్యంపై సుదీర్ఘంగా చర్చించారు. మూసీ ప్రాజెక్టు రూపకల్పన, అమలులో ప్రజల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.

ఈ ప్రాజెక్టు కేవలం ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాకుండా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. సరిగ్గా నేటి నుంచి ఏప్రిల్ 15 వరకు ప్రజలు తమ సలహాలను, సూచనలను ప్రభుత్వానికి పంపవచ్చని కమిటీ వెల్లడించింది. ప్రాజెక్టుపై అభిప్రాయాలు ఉన్నవారు [email protected] అనే అధికారిక ఇమెయిల్ ఐడీకి తమ సూచనలను పంపాలని కేబినెట్ సబ్ కమిటీ కోరింది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, పునరావాస ప్యాకేజీలు, అభివృద్ధి పనుల విషయంలో పారదర్శకత పాటించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రజలు ఇచ్చే నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ప్రాజెక్టు విజయవంతానికి ఎంతో దోహదపడతాయని కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది.

Next Story