TG Municipal Elections: క్యాంపు రాజకీయాలు షురూ.. పోటా పోటీగా అభ్యర్థులను తరలిస్తున్న పార్టీలు

by Prasad Jukanti |

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపడం ఆసక్తిగా మారింది.

TG Municipal Elections: క్యాంపు రాజకీయాలు షురూ.. పోటా పోటీగా అభ్యర్థులను తరలిస్తున్న పార్టీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల (Telangana Municipal Elections) ఫలితాల వేళ క్యాంపు రాజకీయాలు (Camp Politics) ఆసక్తిని రేపుతున్నాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తమ అభ్యర్థులెవరూ చేజారకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలను షురూ చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పాటు తమకు అందిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ చేసిన తమ అభ్యర్థులందరిని శిబిరాలకు తరలిస్తున్నాయి. అయితే నిన్న జరిగిన ఈ ఎన్నికకు సంబంధించి రేపు ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇంకా ఫలితాలు వెలువడకముందే పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో స్టేట్ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారుతోంది.

వారికి అందుబాటులో ఉండేలా:

సూర్యాపేట, ఆదిలాబాద్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్, బీజేపీ క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఇక మంచిర్యాల జిల్లా చెన్నూర్, మరియు కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలని ఉద్దేశంతో ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి సెగ్మెట్ కావడంతో ఈ రెండు స్థానాలను కైవసం చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బీఆర్ఎస్ అభ్యర్థులను బుధవారం రాత్రే క్యాంపులకు తరలించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ సూచన మేరకు అభ్యర్థులు సైతం తమ లగేజ్ ని సర్దుకుని క్యాంపుల బాట పడుతున్నారు. వీరినందరిని హైదరాబాద్ శివారులలోని ఫామ్ హౌస్‍లోల ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి నేతలతో మంతనాలు జరిపేందుకు వీలుగా రాజధాని శివారు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

సెమీ ఫైనల్స్ లో పై చేయి కోసం:

సాధారణంగా మున్సిపల్ ఎన్నికలు అంటేనే మినీ సంగ్రామంగా భావిస్తుంటారు. క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలను నిరూపించేంది ఈ ఎన్నికలే. ఈ ఎన్నికల కోసం ఎంత కష్టపడ్డాం? ఎన్ని వార్డులు గెలిచామన్నది కాకుండా ఎన్ని మున్సిపాలిటీలు, ఎన్ని కార్పొరేషన్లు మన ఖాతాలో వేసుకున్నామన్నదే రాజకీయ పార్టీల గెలుపునకు గీటురాయిగా నిలుస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం, భవిష్యత్తులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇవే సెమీ ఫైనల్స్ అనే ప్రచారం జరుగుతోంది. దీంతో రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలకు రూట్ మ్యాప్‍‍ను డిసైడ్ చేసే ఈ ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. గెలిచిన తమ అభ్యర్థులు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఈ క్యాంపు రాజకీయాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయనేది రేపు వెలువడబోయే ఫలితాలు, ఈ నెల 16న జరగబోయే చైర్‌పర్సన్‌/మేయర్‌, వైస్‌ చైర్‌పర్సన్‌/డిప్యూటీ మేయర్‌ ఎన్నికలతో తేలనుంది.

Next Story