ఈ-వేస్ట్ పై మున్సిపల్ కార్పొరేషన్లు ఫోకస్

by Bhoopathi Nagaiah |

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 99రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగానే ఈ-వేస్ట్ కలెక్షన్ పై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఫోకస్ పెట్టాయి.

ఈ-వేస్ట్ పై మున్సిపల్ కార్పొరేషన్లు ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 99రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగానే ఈ-వేస్ట్ కలెక్షన్ పై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఫోకస్ పెట్టాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శనివారం జల్ పల్లి పరిధిలోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ–వేస్ట్ సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం రానున్న రంజాన్ పండుగ నేపథ్యంలో పహాడీ షరీఫ్ ఈద్‌గాహ్ వద్ద శుభ్రత, ఇతర ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ–వేస్ట్ సేకరణ, నిర్వహణ, నిల్వ విధానాలను కమిషనర్ పరిశీలించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను అధికారిక సేకరణ కేంద్రాల ద్వారా మాత్రమే అప్పగించేలా ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. నగరంలో పర్యావరణానికి హాని కలగకుండా ఉండేందుకు ఈ–వేస్ట్‌ను శాస్త్రీయంగా సేకరించి ప్రాసెస్ చేయడం అవసరమని పేర్కొన్నారు.

సీఎంసీ పరిధిలో ఈ–వేస్ట్ సేకరణ కేంద్రం తనిఖీ

ఎన్‌ఏసీ ఈ–వేస్ట్ సేకరణ కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనితీరును సీఎంసీ కమిషనర్ సృజన శనివారం పరిశీలించారు. అసిస్టెంట్ కమిషనర్ (శానిటేషన్)తో కలిసి ఇళ్ల నుంచి సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను స్వీకరించడం, వర్గీకరించడం వంటి ప్రక్రియలను సమీక్షించారు. ఈ సందర్భంగా ట్రైడెంట్ హైదరాబాద్ సంస్థ 250 కిలోల బల్క్ ఈ–వేస్ట్‌ను అందజేసినందుకు కమిషనర్ ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

కేంద్రంలో ఈ–వేస్ట్ సేకరణ, నిల్వ, నిర్వహణ విధానాలను పరిశీలించిన కమిషనర్ ఇళ్లలో ఉపయోగించని ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతిపొందిన కేంద్రాల ద్వారా మాత్రమే ఇచ్చేలా ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ఈ–వేస్ట్ శాస్త్రీయ నిర్వహణ అత్యంత అవసరమని ఆమె పేర్కొన్నారు. అంతకుముందు గచ్చిబౌలి ప్రాంతంలోని ఐకియా–మీనాక్షి డిలైట్ రోడ్డు మార్గంలో పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను తొలగింపు పనులను సీఎంసీ కమిషనర్ జి. సృజన పరిశీలించారు. రోడ్డు వెంట రెండు చోట్ల గుర్తించిన డెబ్రిస్ గుట్టలను తొలగించే చర్యలను ఆమె సమీక్షించారు.

Next Story