పురపాలక శాఖ 100 రోజుల ప్రణాళిక..నేటి నుంచే

by velandi.Saikiran |   (  Updated:2025-06-02 17:20:48  IST  )

తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రజలకు మెరుగైన సేవలందించడంతోపాటు సంక్షేమ కార్యక్రమాలను

పురపాలక శాఖ 100 రోజుల ప్రణాళిక..నేటి నుంచే
X

ఆదాయం..అభివ్రుద్ధి..సంక్షేమం

పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల కల్పన

చెత్త నిర్వహణపై ఫోకస్

జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు

పురపాలక శాఖ 100 రోజుల ప్రణాళిక

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రజలకు మెరుగైన సేవలందించడంతోపాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని పురపాలకశాఖ నిర్ణయించింది. తెలంగాణ రైజింగ్-2047 పేరుతో పట్టణ స్థానిక సంస్థల్లో అమలు చేయనున్న జూన్ 2వ తేది నుంచి సెప్టెంబర్ 10వ తేది వరకు 100రోజుల ప్రణాళిక రూపొందించింది. పరిశుభ్రమైన, ఆరోగ్వవంతమైన, ఏలాంటి విపత్తులైనా ఎదుర్కొనే విధంగా పట్టణ ప్రాంతాలను నిర్మించే దిశగా ప్రతిరోజు ‘ఒక చర్చ-ఒక మార్పు’ అనే నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి ‘ప్రజలే ముందు’ అనే విధానంతో స్థిరమైన పట్టణాభివ్రుద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించింది.

ఆదాయం పెంపు..

రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూలు చేశారు. దీంతోపాటు ఆస్తి పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని పురపాలక శాఖ నిర్ణయించింది. అందులో భాగంగానే ఆస్తిపన్ను పరిధిలోని అసెస్ మెంట్లను గుర్తించడంతోపాటు రెసిడెన్షియల్ బిల్డింగ్ అనుమతి తీసుకుని కమర్షియల్ గా నిర్మించడం, భువన్ సర్వే ద్వారా గుర్తించి ఆస్తి పన్నును సవరించాలని నిర్ణయించారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయడం వంటి గుర్తించి వాటిని ఆదాయాన్ని పెంచుకోవాలని పురపాలకశాఖ నిర్ణయించింది.

అభివృద్ధి…చెత్త నిర్వహణ

పట్టణ స్థానిక సంస్థల్లో ఆదాయం పెంచుకోవడంతోపాటు అభివ్రుద్దిని కూడా పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే రోడ్ల నిర్వహణ, నాలాల నిర్వహణను మెరుగుపర్చాలని నిర్ణయించింది. దీంతోపాటు పట్టణ కేంద్రాల్లో రోడ్ల నిర్మాణంతోపాటు జంక్షన్ల అభివ్రుద్ధి కీలకంగా మారింది. ఎక్కడెక్కడ జంక్షన్లను అభివ్రుద్ది చేయాలో గుర్తించి ఈ ప్రణాళికలో పూర్తి చేయనున్నారు. దీంతోపాటు చెత్త నిర్వహణ కూడా సవాల్ గా మారింది. మున్సిపాలిటీల్లో ఉత్పత్తి అవుతున్న చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ చేయడానికి క్లస్టర్లను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన టెండర్లను పూర్తి చేశారు. సింగరేణి ప్రాంతంలోని మున్సిపాలిటీలకు సంబంధించిన చెత్త ద్వారా విద్యుత్ తయారు చేయడానికి ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్వచ్ఛ భారత్ మిషన్ తోపాటు అమ్రుత్ సంస్కరణలను అమలు చేయాలని నిర్ణయించారు.

సంక్షేమం..

పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతోపాటు ఆరోగ్యానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా దోమల నియంత్రణపై ఫోకస్ పెట్టారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోనున్నారు. దీంతోపాటు ప్రజలకు రక్షిత మంచినీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా మహిళా సంఘాలను ఏర్పాటు చేయడంతోపాటు ఉన్న సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను అందజేయాలని నిర్ణయించారు. మహిళా సంఘాలకు చెందిన మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడానికి ప్రత్యేక బజార్లు, స్ట్రీట్ పుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నారు. వీధి వ్యాపారులను గుర్తించడంతోపాటు వారికోసం ఏర్పాటు చేసిన గ్రీన్, అంబర్, రెడ్ జోన్లను సమీక్షించాలని నిర్ణయించారు.

పర్యావరణం…

పట్టణాల్లో పర్యావరణాన్ని మెరుగుపర్చడానికి, కాలుష్య నియంత్రణ, ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యంగా వనమహోత్సవంలో భాగంగానే భారీ ఎత్తున మొక్కలను నాటాలని నిర్ణయించారు. అమ్రుత్ మిత్రల ద్వారా 50లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పిల్లల కోసం పార్కులను ఏర్పాటు చేయనున్నారు.

Next Story