Container School: దేశానికి రోల్ మోడల్‌గా ములుగు కంటైనర్ పాఠశాల.. ఏఐసీసీ కితాబు

by Ramesh Naini |   (  Updated:2025-02-16 08:41:30  IST  )

ములుగు నియోజకవర్గంలోని బంగారు పల్లిలో కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క సమక్షంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Container School: దేశానికి రోల్ మోడల్‌గా ములుగు కంటైనర్ పాఠశాల.. ఏఐసీసీ కితాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ములుగు నియోజకవర్గంలోని బంగారుపల్లిలో (Container School) కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క సమక్షంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ములుగులోని అటవీ ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో శాశ్వత భవనాలు సాధ్యం కాని చోట కంటైనర్ పాఠశాలలు, ప్రాథమిక వైద్య కేంద్రాలను మంత్రి సీతక్క ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రెండు స్కూల్స్, ఒక ఆసుపత్రి ఏర్పాటు చేశారు.

ఈ కంటైనర్ స్కూల్ విజయ గాదను తాజాగా ఎక్స్ వేదికగా (Congress) ఏఐసీసీ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆటంకాలను అధిగమించి ప్రతి చిన్నారికి విద్యనందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యం అని, కాంగ్రెస్ సర్కార్‌లో విరబూసిన విద్య హక్కు చట్టం అంటూ పేర్కొంది. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవలో ముందుకు సాగుతు ప్రజా పాలన అందించాలని ఆకాంక్షించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపింది. ఈ మేరకు ఎక్స్‌లో (Rahul Gandhi) రాహుల్‌గాంధీ, (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే “దేశానికి రోల్ మోడల్ గా ములుగు కంటైనర్ పాఠశాల” అంటూ వివరాలను ప్రస్తావిస్తూ మంత్రి సీతక్క ట్వీట్ చేశారు.

కాగా, ములుగు జిల్లాలో సెప్టెంబర్ 2024 లో తెలంగాణ తొలి కంటైనర్ స్కూల్ (Minister Seethakka) మంత్రి సీతక్క ప్రారంభించారు. అటవీ ప్రాంతం అయిన బంగారు పల్లి గ్రామంలో 13 లక్షలతో మంత్రి సీతక్క చొరవ, కలెక్టర్ దివాకర్ అత్యంత వినూత్న ఆలోచనతో కంటైనర్ స్కూల్ ఏర్పడింది. అక్కడ నడుస్తున్న పాత పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటవీ ప్రాంతం కావడంతో పాఠశాలకి నూతన భవనం నిర్మించుకుంటామని చెబితే.. అటవీ శాఖ అనుమతి నిరాకరించింది. ఈ ప్రాంతంలో గూడాలన్నీ కూడా రిజర్వ్ అటవీ ప్రాంతం పరిధిలోనివి. దీంతో అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు మంజూరు కావు. రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతుంటాయి. దీంతో కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇది 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తుంటారు. ఈ పాఠశాల ఏర్పాటుతో అక్కడి ఆదివాసీ పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా మారింది.

Next Story