- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముద్ర రుణాల్లో ఆర్థిక విప్లవం.. మహిళలదే అగ్రస్థానం!
చిరు వ్యాపారులకు అండగా నిలుస్తూ 11 ఏళ్లు పూర్తి చేసుకుంది 'ప్రధానమంత్రి ముద్ర యోజన'.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలోని నగరాలు, పట్టణాల్లో చిరు వ్యాపారాలపై ఆధారపడి కోట్లాది మంది జీవిస్తుంటారు. స్థానిక ఆర్థిక వ్యవస్థలకు చిరువ్యాపారాలే కీలకం. కానీ, వారి వ్యాపార అవసరాలకు రుణం పొందడం మాత్రం కష్టంగా మారింది. ఎక్కువగా అధిక వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్రం 2015 ఏప్రిల్ 8న ప్రధానమంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై)ని ప్రారంభించింది. చిరు వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా, సులభమైన ప్రక్రియ ద్వారా రుణాలు అందించాలనేది ఈ పథకం లక్ష్యం. 11 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ పథకం కింద ఇప్పటివరకు 57 కోట్ల రుణ ఖాతాలకు రూ.40.07 లక్షల కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ముద్ర రుణాల ద్వారా తమ వ్యాపారాల్లో నిలదొక్కుకునేందుకు, వ్యాపారాలు విస్తరించేందుకు చిరు వ్యాపారులకు అవకాశం లభించింది. ముఖ్యంగా ముద్ర రుణాలు పొందుతున్న వారిలో 60 శాతం వరకు మహిళలే ఉండటంతో మహిళల ఆర్థిక సాధికారతకు ఈ పథకం దోహదపడుతోంది.
కేంద్రం సహకారంతో లోన్స్..
చిరు వ్యాపారులకు పూచీకత్తు లేని రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్(ముద్ర) సంస్థ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రుణాలు మంజూరు చేస్తుంది. ఈ సంస్థలు చిరు వ్యాపారులకు రుణాలు ఇస్తాయి.
నాలుగు కేటగిరీల్లో రుణాలు..
ప్రధానమంత్రి ముద్ర యోజనలో నాలుగు కేటగిరీల కింద రుణాలు మంజూరు చేస్తారు. ముందుగా శిశు విభాగం పేరుతో గతంలో ఎలాంటి రుణ చరిత్ర లేని చిరు వ్యాపారులు, కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వారికి రూ.50 వేల వరకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. రెండవది కిశోర్ విభాగం ద్వారా వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి, వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తాయి. మూడోవది తరుణ్ విభాగం పేరుతో వ్యాపారాన్ని విస్తరించేందుకు, కొత్త యంత్రాల కొనుగోలు వంటి అవసరాల కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తాయి. చివరగా తరుణ్ ప్లస్ 2024లో ఈ విభాగాన్ని ప్రారంభించారు. తరుణ్ విభాగం కింద తీసుకున్న లోన్లు చెల్లించిన తర్వాత రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణం ఇస్తాయి.
రుణాలకు ఎవరు అర్హులు..
వీధి వ్యాపారులు, దుకాణాలు నడిపే వారు, ఆహార ఉత్పత్తులు, దుస్తులు విక్రయించే వారు అర్హులు. వీరితో పాటు ఆటోలు, వస్తు రవాణా వాహనాలు నడిపేవారు, చేపలు, తేనెతీగలు, పశువులు, కోళ్లు వంటి వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్వయం ఉపాధి పొందుతున్న వారు ముద్ర రుణాలను పొందొచ్చు. ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో ముద్ర రుణాలను తీసుకోవచ్చు.






