- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ముదిరాజ్‍ల జెండా ఎగరాలి: ఈటల
తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన ముదిరాజ్ సర్పంచ్‍లు, ఉపసర్పంచ్ లకు సన్మాన కార్యక్రమం జరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ముదిరాజ్‍ల జెండా ఎగరాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatela Rajender) అన్నారు. తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ (Telangana Mudiraj Corporation) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన ముదిరాజ్ సర్పంచ్ (Sarpanch), ఉప సర్పంచ్‍లను ఇవాళ రవీంద్రభారతిలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఈటల రాజేందర్, మంత్రి వాకిటి శ్రీహరి, కాసాని జ్ఞానేశ్వర్, బండ ప్రకాష్ సహా పలువురు ముదిరాజ్ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడిన ఈటల రాజేందర్.. పార్లమెంట్ సభ్యులు గెలవడం కంటే వార్డు సభ్యులు, సర్పంచ్ గెలవడం కష్టం అని సేవ ఎంత చేసినా ఎన్నికల్లో డబ్బుల ప్రవాహం ఉండడం దుర్మార్గమైన విషయం అన్నారు. ఆ డబ్బుల ప్రవాహాన్ని తొక్కి పడేసి గెలిసి వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు.. అవకాశం అందరికీ రాదు. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దని సూచించారు. మా వాడిని గెలిపిస్తే గొప్పగా పనిచేశారు అనే పేరు రావాలన్నారు. మంత్రి శ్రీహరి ఉన్నారు నేను కూడా మీకు అండగా ఉంటాను. ఏ సమస్య వచ్చినా తీర్చడానికి అందుబాటులో ఉంటామమని భరోసా ఇచ్చారు. ఇన్నాళ్లు బతుకుతెరువు కోసం పోరాడాం కానీ రాజకీయాల మీద మనకి యావలేదు. ఇప్పుడిప్పుడే ఆ తెలివి వస్తుంది. ప్రతి ఇంట్లో చదువుకున్న వారు ఉన్నారు. కేవలం సంఖ్య మాత్రమే సరిపోదు.. వ్యూహం కార్యాచరణ లౌక్యం కూడా కావాలన్నారు. ఇంకా ఎన్నాళ్లు వెనకబడి ఉందాం? ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి? రోశం, చైతన్యం, జనాభా ఉన్న జాతి మనది. అన్ని ఉన్నా కూడా దేహి అనే పరిస్థితిలో ఉండకూడదు అనే మీ ఆలోచన విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు. మనం వేరే వారిని ద్వేషించవద్దు వ్యతిరేకించవద్దు. ఇంతమంది జనాభా ఉన్న ఎందుకు అడుక్కోవాలి అనేది ఇప్పుడు ప్రశ్న అన్నారు.
బీసీ-ఏ మార్పు కోసం ఉమ్మడిగా పోరాడుదాం:
తెలంగాణలో 4 వేల సొసైటీలు మనకు ఉన్నాయి. పెద్ద గ్రామాల్లో ఉన్న చెరువుల మీద హక్కులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. తాళ్లు ఎక్కే వాళ్లవే తాటిచెట్లు, చేపలు పట్టే వాళ్ళవే చెరువులు. చెరువులు మీద హక్కులు కావాల్సిందేనన్నారు. చెరువుల సొసైటీలో సభ్యత్వం కోసం ఇప్పుడున్న జీవోను రద్దుచేసి కొత్త జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాననన్నారు. బ్రోకర్ల వ్యవస్థ పూర్తిగా లేకుండా చేయాలి. ఉచిత చేప పిల్లలు, ఐస్ బాక్సులు, ఐస్ ఫ్యాక్టరీలు, టీవీఎస్ మోపెళ్ళు, ట్రాన్స్పోర్ట్ కి అవసరమైన డీసీఎంలు.. ఇవన్నీ రావడానికి అప్పుడు నేనే కృషి చేశానన్నారు. పెద్ద ప్రాజెక్టులలో కూడా జోన్లు ఏర్పాటు చేసి చేపలు పట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలన్నారు. బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలనేది సమంజసమైన డిమాండ్ దానికోసం అందరం కలిసి కొట్లాడుదామని పిలుపునిచ్చారు. సాహసానికి మారు పేరు మన జాతి అని గ్రామాలలో అందరినీ కలుపుకొని లీడ్ చేయాలని సూచించారు. రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచేయాలని, జాతి ప్రయోజనాల కోసం ఎక్కడికి పిలిచినా వస్తానని మీకు మాట ఇస్తున్నానన్నారు.






