- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం గారూ.. ఎందుకీ ‘వివక్ష’ వ్యాఖ్యలు?: కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజం
దక్షిణాది రాష్ట్రాల సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయ అసమానతల పేరుతో ప్రజలను విడదీయాలని చూస్తున్నారా అని ఆయన నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తే సీఎం వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి మహిళలంటేనే ద్వేషమని, అందుకే 50 ఏళ్ల పాలనలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు కాపీలను చింపిన ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలతో అంటకాగుతున్నారని ఆయన విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా మహిళా రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని బండి సంజయ్ అన్నారు.
సీట్ల పెంపుపై అభ్యంతరం ఏంటి..
అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచితే దక్షిణాదికి జరిగే నష్టమేంటని బండి సంజయ్ నిలదీశారు. ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం సీట్లను పెంచితే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు ప్రాంతీయ అసమానతల పేరు చెప్పి చలి కాచుకుంటారని, మీలో దేశభక్తి, జాతీయవాదం మచ్చుకైనా కన్పించవా అని ధ్వజమెత్తారు. దేశాన్ని విభజించే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందనే వణుకు సీఎంలో మొదలైందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా అక్కడ కాంగ్రెస్ పాచికలు పారడం లేదని అర్థమైందని, అందుకే దక్షిణాదికి అన్యాయం అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. త్వరలోనే తమిళనాడు (Tamilnadu), కేరళ (Kerala) ప్రజలు కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలకు కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ కామెంట్ చేశారు.






