ఆ టెండర్లలో ఎంపీ జోక్యం..సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఎత్తేసేందుకు లాబీయింగ్

by Kema Shiva Kumar |

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్ల టెండర్ ప్రక్రియను ఓ కాంగ్రెస్ ఎంపీ శాసిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.

ఆ టెండర్లలో ఎంపీ జోక్యం..సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఎత్తేసేందుకు లాబీయింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్ల టెండర్ ప్రక్రియను ఓ కాంగ్రెస్ ఎంపీ శాసిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. పౌల్ట్రీ మాఫియాకు అనుకూలంగా నిబంధనలు రూపొందించేలా సర్కారులో తన పలుకుబడిని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం సదరు ఎంపీకి పౌల్ర్టీ మాఫియా దాదాపు రూ.5 కోట్లు నజరానా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఆ ఎంపీ ఒత్తిడి మేరకు అధికారులు ప్రస్తుతం ఉన్న సెంట్రలైజ్డ్ ఎగ్ టెండర్ ప్రక్రియను రద్దు చేసి, జిల్లాల వారీగా టెండర్లు పిలిచేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. అందుకు సంబంధించి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఏఎస్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది.

ఎంపీ ఒత్తిడి మేరకు టెండర్ పొడిగింపు!

చిన్నపిల్లలు, బాలింతలకు ఉచితంగా గుడ్లు అందజేయడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ సెంటర్లలో గుడ్ల సరఫరాకు ఏటా మహిళా, శిశు సంక్షేమ శాఖ టెండర్లను పిలుస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది మార్చి 30న టెండర్ ఆహ్వానించారు. అయితే టెండర్ల గడువు రెండు, మూడు రోజుల్లో ముగిసే సమయంలో దక్షిణ తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ ఎంపీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న టెండర్ల నిబంధనలు మార్చి, కొత్తగా టెండర్లు పిలవాలని తనకు ఉన్న పలుకుబడితో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. దీంతో సదరు పెద్దలు మహిళా శిశు సంక్షేమ శాఖను ఆదేశించడంతో ఉన్నపళంగా ఏప్రిల్ 15న టెండర్ల గడువును నెల రోజుల పాటు (మే 15వరకు) పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే టెండర్ గడువు పెంచిన విషయం సదరు శాఖ మంత్రి సీతక్కకు సైతం తెలియదనే గుసగుసలు సెక్రెటేరియట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

‘సెంట్రలైజ్డ్ సిస్టం’ ఎత్తివేసేలా..

ప్రస్తుతం అమల్లో ఉన్న సెంట్రలైజ్డ్ టెండర్ సిస్టమ్ ను ఎత్తేయాలని పౌల్ట్రీ రైతుల పేరిట కొందరు కాంట్రాక్టర్లు ఏకం అయ్యారు. గత ప్రభుత్వంలో రైతులకు నేరుగా సరఫరా చేసే అవకాశం ఇవ్వలేదని, ఈ ప్రభుత్వంలో తమకు న్యాయం చేయాలని సదరు ఎంపీని ఆశ్రయించారు. అయితే తన దగ్గరికి వచ్చిన వారు నిజమైన రైతులేనా? కాదా? అనే విషయాన్ని చెక్ చేసుకోకుండా ఆ ఎంపీ సదరు మాఫీయాకు మద్దతుగా నిలిచినట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకు ఆ పార్లమెంట్ సభ్యుడికి ఏకంగా రూ. 5 కోట్లు నజరానా ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే ఆ ఎంపీతో ప్రభుత్వ పెద్దలకు సాన్నిహిత్యం ఉండటంతో టెండర్ గడువును పొడగించి, నిబంధనలు మార్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తున్నది.

డీ–సెంట్రలైజ్డ్ సరఫరాలో అక్రమాలు

రాష్ట్రంలో 2022 నుంచి సెంట్రలైజ్డ్ విధానంలో అంగన్ వాడీ కేంద్రాలకు గుడ్లను సరఫరా చేస్తున్నారు. అందుకోసం 33 జిల్లాలను 7 జోన్లుగా విభజించి టెండర్లు పిలుస్తున్నారు. ఈ విధానం ద్వారా గుడ్ల సరఫరాలో మానిటరింగ్ తోపాటు, అక్రమాలకు చెక్ పెడుతున్నారు. అయితే ఈ విధానంలో సరఫరాదారులకు పెద్ద ఎత్తున లాభాలు రావడం లేదని, అదే జిల్లాల వారీగా టెండర్లు పిలిస్తే సరఫరాలో అక్రమాలు చేయడం వల్ల ఎక్కువ లాభాలు పొందవచ్చనే ప్లాన్ వేసినట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకోసం సదరు కాంగ్రెస్ ఎంపీ ద్వారా జిల్లాల వారీగా టెండర్లు పిలవాలని ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది. ఒకవేళ జిల్లాల వారీగా టెండర్లు పిలిస్తే, క్షేత్ర స్థాయి అధికారులు, సరఫరాదారులు కుమ్మక్కై తక్కువ గుడ్లు సరఫరా చేసి, ఎక్కువ అందించామని ఆధారాలు సృష్టించే ప్రమాదం ఉందని ఐఏఎస్ వర్గాల్లో టాక్ ఉంది.

టెండర్లు తెరుస్తారా.. కొత్త విధానం ప్రకటిస్తారా?

ప్రస్తుతం ఉన్న సెంట్రలైజ్డ్ టెండర్ల గడువు నేటి(ఈనెల 15)తో ముగుస్తున్నది. ఆ తరువాత టెండర్లు తెరిచి, తక్కువ ధరకు కోడ్ చేసిన వారికి పనులు అప్పగించాలి. ప్రస్తుతం ఉన్న విధానాన్ని రద్దు చేసి డీ–సెంట్రలైజ్డ్ టెండర్ ప్రక్రియను అమలు చేసేందుకు ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ కొత్త రూల్స్ ను అమలు చేయాలంటే ప్రస్తుత టెండర్లను రద్దు చేసి, మళ్లీ టెండర్లను పిలవాల్సి ఉంటుంది. ఈ విషయంపై రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Next Story