మహేశ్వర్ రెడ్డి మతి స్థిమితం కోల్పోయాడు : ఎంపీ మల్లు రవి

by Naga Rani Yarlagadda |

బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్​రెడ్డి మతి స్థిమితం కోల్పోయాడని నాగరకర్నూల్​ఎంపీ మల్లు అన్నారు. మంత్రి వర్గ విస్తరణను సీఎం రేవంత్​రెడ్డి అడ్డుకుంటున్నారని మహేశ్వర్​రెడ్డి అనడం ఆయన అవివేకమన్నారు.

మహేశ్వర్ రెడ్డి మతి స్థిమితం కోల్పోయాడు : ఎంపీ మల్లు రవి
X
  • మంత్రి వర్గ విస్తరణను సీఎం అడ్డుకుంటున్నారని అనడం అవివేకం
  • బీజేపీ నేత వ్యాఖ్యలపై ఎంపీ మల్లు రవి ఫైర్​

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్​రెడ్డి మతి స్థిమితం కోల్పోయాడని నాగరకర్నూల్​ఎంపీ మల్లు అన్నారు. మంత్రి వర్గ విస్తరణను సీఎం రేవంత్​రెడ్డి అడ్డుకుంటున్నారని మహేశ్వర్​రెడ్డి అనడం ఆయన అవివేకమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిపై ఎలేటి మహేశ్వర్​రెడ్డి చేసిన వ్యాఖ్యలను మల్లు రవి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు మధ్య పూర్తి స్థాయిలో సమన్వయం ఉందని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతమైన ప్రగతి సాధిస్తుండడం వల్లే బీజేపీ వాళ్లకు ఏమి మాట్లాడాలో తెలియక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడైనా మహిళకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నారా? ఎంపీ ప్రశ్నించారు. సన్న బియ్యం ఇస్తున్నారా?, ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నారా?, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా? 500 రూపాయలకు గ్యాస్ ఇస్తున్నారా? ఇవేమీ ఇవ్వడానికి బీజేపీ నాయకులకు చేతకాదని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నా.. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతున్నా, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా కూడా బీజేపీ నాయకులకు అవన్నీ కనిపించడం లేదని పేర్కొన్నారు. మంత్రివర్గం విడిపోతే ఇవన్నీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలా సాధ్యమో? బీజేపీ నాయకులు చెప్పగలరా? అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీలో తీవ్రమైన వర్గపోరు కొనసాగుతోందని, అందుకే చాలా కాలంగా బీజేపీ అధ్యక్షుల ఎంపిక వాయిదా పడుతోందన్నారు. రోజు మీడియా లో ఉండాలంటే కాంగ్రెస్ పైన, ప్రభుత్వంపైన ఏదో ఒక అబద్ధాల ప్రచారం చేయాలన్నది బీజేపీ ఎత్తుగడ అని వ్యాఖ్యనించారు. బీజేపీ నాయకులు గోబెల్స్ వారసులు, అబద్ధాల పునాదుల మీదనే వారి రాజకీయ జీవితం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన, మంత్రి వర్గం పైన ఎన్ని అవాకులు, చెవాకులు మాట్లాడినా లాభం లేదని ఈసందర్భంగా మల్లు రవి స్పష్టం చేశారు.

Next Story