కేసీఆర్ ఇచ్చిన చిప్పతో ఢిల్లీలో CM రేవంత్ ప్రదక్షిణలు: MP లక్ష్మణ్ ఫైర్

by Satheesh |

రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పులకుప్పగా మార్చారని, కేసీఆర్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిప్ప చేతికిస్తే.. రేవంత్ రెడ్డి ఆ

కేసీఆర్ ఇచ్చిన చిప్పతో ఢిల్లీలో CM రేవంత్ ప్రదక్షిణలు: MP లక్ష్మణ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పులకుప్పగా మార్చారని, కేసీఆర్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిప్ప చేతికిస్తే.. రేవంత్ రెడ్డి ఆ చిప్ప చేత పట్టుకుని ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిళ్లకు లొంగిపోయి బీఆర్ఎస్‌తో రేవంత్ రెడ్డి లాలూచీ పడుతున్నారని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును అందుకే సీబీఐకి అప్పగించడం లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తొలి దశ ఉద్యమంలో 369 మంది ప్రాణాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బలిగొందని, కానీ తెలంగాణ ఉద్యమానికి బీజేపీ మద్దతు తెలిపి పోరాటం చేసిందని ఆయన గుర్తుచేశారు.

తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారనే విషయాన్ని వివరించారు. అలాగే సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లోక్ సభ, రాజ్యసభలో తెలంగాణ కోసం గళమెత్తారని లక్ష్మణ్ చెప్పారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సోనియా గాంధీని రేవంత్ రెడ్డి బలి దేవత అన్నారని, కానీ ముఖ్యమంత్రి అయ్యాక బలి దేవత, తెలంగాణ దేవత అయిందా అంటూ ఆయన విమర్శించారు. బలి దేవతను ఎలా ఆరాధిస్తున్నారో సమాధానం చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం కవులు, కళాకారులు, ఉద్యమకారులను విస్మరించిందని, ఈ ప్రభుత్వం బీజేపీని భాగస్వామ్యం చేయలేదని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాజకీయ వివాదాలు సృష్టించి కాలం గడుపుతున్నారని లక్ష్మణ్ చురకలంటించారు. దీనిపై కోదండరాం నోరు మెదపకపోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణను సోనియా ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పడం సరికాదని ఫైరయ్యారు. సకల జనులు పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నారని వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలను అమలు చేయకపోవడం వల్లే కేసీఆర్‌ను గద్దె దించారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపోతే తెలంగాణ ప్రజలు మోడీ వైపు ఉన్నారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి కనువిప్పు కలగాలని లక్ష్మణ్ సూచించారు. కవులు, కళాకారులు, ఉద్యమకారులకు న్యాయం చేయకపోతే రేవంత్ రెడ్డికి ఈ ఐదేళ్లు కష్ట కాలమేనని లక్షణ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమం అనంతరం లక్ష్మణ్ తొలిదశ తెలంగాణ ఉద్యమకారులను. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.

Next Story