గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు పెడచెవిన పెడితే తాడో పేడో తేల్చుకుంటా.. ఎంపీ ఈటల వార్నింగ్

by Ramesh Naini |

గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు పెడచెవిన పెడితే తాడో పేడో తేల్చుకుంటా అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.

గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు పెడచెవిన పెడితే తాడో పేడో తేల్చుకుంటా.. ఎంపీ ఈటల వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు పెడచెవిన పెడితే తాడో పేడో తేల్చుకుంటా అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత ఇక్కడి ప్రజలతో ఉద్యమ కార్యక్రమం మొదలు పెడతాం అని ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటించారు. మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలోని జవహర్ నగర్ డంప్ యార్డ్‌ను బీజేపీ నాయకులతో కలిసి ఎంపీ ఈటల పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకనాడు జనాలు లేనప్పుడు డంపింగ్ యార్డ్ జవహర్ నగర్ లో ఏర్పాటు చేశామని గుర్తుకు చేశారు. ఆప్పుడు 300 టన్నుల చెత్త వేస్తే ఇప్పుడు అది 10 వేల మెట్రిక్ టన్నులకు చేరుకుందని తెలిపారు. దమ్మాయిగూడ జవహర్ నారపల్లి ఘట్కేసర్ వరకు ఉన్న ప్రజలు ఈ డంపింగ్ యార్డు వల్ల ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు.

జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ కొనసాగడం దుర్మార్గమన్నారు. బీజేపీ కొట్లాడడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేస్తే.. అప్పటి ప్రభుత్వం 2017 లో నగరం నాలుగు మూలలా చెత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామని అఫిడవిట్ దాఖలు చేసింది కానీ చేయలేదని వివరించారు. 2021, 22, 25 మూడుసార్లు గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చెత్త లారీలు కప్పు లేకుండా తిరగడం వల్ల ప్రజల మీద ఆ చెత్త పడుతుందన్నారు. ఇక్కడ నివసించే లక్షల మంది ప్రజలు ఇళ్లలో, ఫ్యాక్టరీలో పని చేసి బతికే కడు పేద ప్రజలు.. వారు కష్టపడి సంపాదించే ప్రతి పైసా హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన చెందారు.

వాసనతో శ్వాసకోశ వ్యాధులు, కలుషిత నీటితో అనేక జబ్బులు వస్తున్నాయని, చివరికి పిల్లలు కూడా పుట్టడం లేదని ఇక్కడి ప్రజలు వాపోతున్నారని ఈటల పేర్కొన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా.. పేద ప్రజల రక్తం తాగుతుంది ఈ ప్రభుత్వం అని, ప్రజల జీవితాలతో చెలగాటమడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎంపీ అయ్యాక ప్రభుత్వానికి మొర పెట్టుకున్న కూడా పట్టించుకోవడం లేదన్నారు. నగరం నాలుగు మూలలా డంపింగ్ యార్డులు స్ప్రెడ్ చేయమని కోరాం అయినా వినడం లేదని అన్నారు. గ్రామస్థులు ఆక్సిడెంట్స్ తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, ప్రజలు ఎవరైనా అడ్డుకుంటే డ్రైవర్లతో దాడులు చేయిస్తున్నారని, శంకర్ అనే యువకుడు మీద దాడి చేశారని తెలిపారు. సమస్య పరిష్కారం చెయ్యకపోతే, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేయకపోతే చూస్తూ బీజేపీ ఊరుకోదు అని హెచ్చరించారు.

గతంలో ఇక్కడ ఎంపీగా పని చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు.. ఆయనకు ఇక్కడి ప్రజల బాధలు తెలుసు సమస్య పరిష్కరిస్తాం.. అనుకున్నాం అయినా పరిష్కారం కావడం లేదన్నారు. తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నా.. ఒకే దగ్గర చెత్త వేయవద్దు.. ఇక్కడ ఉన్న గుండ్ల చెరువు నుండి ఏదులాబాద్ చెరువు వరకు అన్ని చెరువులు కలుషితం అయ్యాయని పేర్కొన్నారు. మూసీ కెమికల్ కంటే ఇది ప్రమాదకరం.. భూగర్భ జలాలు కూడా విషపూరితం అయ్యాయని, వెంటనే ప్రభుత్వం స్పందించాలని ఈటల డిమాండ్ చేశారు.

Next Story