Eatala: ఎవరితో పెట్టుకున్నా టీచర్లతో పెట్టుకోవద్దు.. ఎంపీ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Naini |

ఎవరితో పెట్టుకున్నా టీచర్లతో పెట్టుకోవద్దని ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Eatala: ఎవరితో పెట్టుకున్నా టీచర్లతో పెట్టుకోవద్దు.. ఎంపీ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎవరితో పెట్టుకున్నా (Government Teacher) టీచర్లతో పెట్టుకోవద్దని ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలో టీచర్ అచ్చే మురళి పదవీ విరమణ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. టీచర్లు, ప్రభుత్వ పాఠశాలల గురించి ఈ మధ్య ఎక్కువ చర్చ జరుగుతోందన్నారు. ప్రవేట్‌కి పంపించిన తల్లిదండ్రులు అప్పులపాలై మళ్లీ ప్రభత్వ పాఠశాలలవైపే చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వారు క్వాలిఫైడ్ టీచర్లు, కమిట్మెంట్ తో పనిచేస్తున్నారని, స్కూల్స్ లో పిల్లల సంఖ్య పెంచడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో ఉండే సామాజిక స్పృహ, మానవ సంబంధాలు, ఏదన్నా చేయాలనే తపన కాన్వెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలకు ఎక్కువ ఉండదన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు గొప్పవారు అయితే టీచర్లను జీవితకాలం గుర్తు పెట్టుకుంటారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు సరిగ్గా చదువుకోక పోతే సమసమాజం సాధ్యం కాదని, పేదరికం పోదని, నిజమైన విద్య కావాల్సింది వీళ్ళకే అని తెలిపారు. అన్ని గవర్నమెంట్ స్కూల్స్‌ను సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్‌గా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. ఇతర దేశాల్లో విద్య ఉచితంగా అందిస్తున్నారని, కానీ మన దగ్గర ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల వైపు తల్లిదండ్రులు చూస్తున్నారు. మీరు అందుకు అనుగుణంగా పని చేయాలని కోరారు. ఎవరితో పెట్టుకున్నా టీచర్లతో పెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటాను.. ప్రజల ఆలోచనలపై ముద్ర వేయగల శక్తి ఉన్నవారు టీచర్లు.. అని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను.. అని ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు.

Next Story