- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MP Eatala: ఏడాదిలోనే ఛీ కొట్టించుకున్న కాంగ్రెస్.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల అంశంపై ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, లోక్ సభలో బీజేపీ ప్రతిపక్ష నాయకురాలు, సుస్మాస్వరాజ్ జయంతి వేడుకలు శుక్రవారం (Telangana BJP) బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ చిత్రపటానికి ఎంపీ ఈటల రాజేందర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, ఖమ్మం-వరంగల్-నల్లగొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తంరెడ్డిలు బీజేపీ తరఫున బరిలో ఉన్నారని చెప్పారు. ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పరంగా అభ్యర్థిని నిలబెట్టలేక పోయిందన్నారు. కాంగ్రెస్ కూడా ఆయన మా అభ్యర్థి అని నిలిపే ప్రయత్నం చేయలేదు.. అని విమర్శించారు.
టీచర్ల ట్రాన్స్ఫర్స్ సమయంలో 317 జీఓ వస్తే దానికి వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడిన పార్టీ బీజేపీ అని స్పష్టంగా టీచర్లలో ఉందన్నారు. ఆనాడు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పి టీచర్ల దుఃఖానికి కారణం అవుతున్న పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. నాటి టీచర్ల బాధ ఇంకా కొనసాగుతుందని అన్నారు. అందుకే తమ అభ్యర్థికి ఓటు వేస్తే టీచర్లకు సంపూర్ణంగా అండగా పార్టీ ఉంటుందన్నారు. గ్రాడ్యుయేట్లు కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అమెరికా సైతం ఆంక్షలు విధించిన నేపథ్యంలో మన పిల్లలకు మనమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.. అందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వాలని.. నాణ్యమైన యువశక్తిని తయారుచేయాలని 2024-25 కేంద్ర బడ్జెట్‌లో రూ. 4 లక్షల కోట్ల రూపాయలు బాజాప్తా పెట్టారని తెలిపారు.మోడీ ప్రభుత్వం మొదటి సారిగా ఈ ప్రయత్నం చేస్తుందని, నిరుద్యోగ సమస్య కంటే పెద్ద సమస్య లేదు అని భావిస్తున్నారని తెలిపారు. భారత అభివృద్ధిలో నిరుద్యోగులను భాగస్వామ్యం చేయకపోతే క్షమించరాని తప్పు అని భావించి ఈ పని చేస్తుందన్నారు.
బీఆర్ఎస్ అబద్ధాలు కొత్త కాదు!
బీఆర్ఎస్ (BRS) అబద్ధాలు మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని విమర్శించారు. ఇక, ఎంత ఇష్టపడి తెచ్చుకున్నారో ఒక ఏడాది కాలంలోనే అంత ఛీ కొట్టించుకుంటున్న పార్టీ (Congress) కాంగ్రెస్ అని తీవ్ర విమర్శలు చేశారు. అనేక ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురిచేస్తారు.. అయినా స్వేచ్ఛగా నిజాయితీగా ఓటు వేయాలని కోరారు. పార్టీ నాయకులంతా 27 వరకు మన అభ్యర్థులను గెలిపించేందుకు పని చేయాలని పిలుపునిచ్చారు. (TUTF) టీయూటీఎఫ్ టీచర్ల సంఘం కూడా బీజేపీ అభ్యర్థులకి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటిస్తూ ఉత్తరం ఇచ్చిందనీ, ఉత్తరాన్ని మీడియాకు ఈటల చూపించారు.
తెలంగాణ చిన్నమ్మ..
తెలంగాణ బిడ్డలారా మీకు బీజేపీ అండగా ఉంటుంది.. ఆత్మహత్యలు చేసుకోవద్దని కుటుంబాలను ఓదార్చిన నాయకురాలు సుష్మా స్వరాజ్ అని ఈటల కొనియాడారు. ఆమె ఉద్యమ సమయంలో తెలంగాణలో అనేక సభల్లో పాల్గొన్నారని, సిరిసిల్లతో పాటు అనేక మీటింగులకు వారితో కలిసి ప్రయాణం చేసి సభల్లో పాల్గొన్న చరిత్ర ఇప్పటికీ నా మదిలో ఉంది.. అని గుర్తుకు చేశారు. మీరు పార్లమెంటులో బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తాం.. అని చెప్పిన నాయకురాలు ఆమె అని పేర్కొన్నారు. నాడు టీఆర్ఎస్‌కు ఎంపీలు ఇద్దరే అని, అయినప్పటికీ మేము మీకు అండగా ఉన్నామని ఆమె చెప్పారని వెల్లడించారు. బిల్లు పెట్టినప్పుడు ఏకోన్ముఖంగా శషభిషలు లేకుండా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీ బీజేపీ అని, అమలుపరచిన నాయకురాలు సుష్మా స్వరాజ్ అని హర్షం వ్యక్తం చేశారు. ఆమె తెలంగాణ చిన్నమ్మ.. ఆమెను ఎన్నటికీ తెలంగాణ సమాజం మరచిపోదన్నారు.






