మిమ్మల్ని వదిలిపెట్టరు.. 42% అమలు చేసి స్థానిక ఎన్నికలు జరపాలి : ఎంపీ ఈటల ఫైర్

by Ramesh Naini |

తెలంగాణలో ఉన్న బీసీ సమాజం మిమ్ముల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు.

మిమ్మల్ని వదిలిపెట్టరు.. 42% అమలు చేసి స్థానిక ఎన్నికలు జరపాలి : ఎంపీ ఈటల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో.. బీసీల సమస్య అడ్డం పెట్టుకొని అది తేలేవరకు ఎన్నికలు జరపమని మోసం చేసే ప్రయత్నం చేస్తే.. తప్పకుండా తెలంగాణలో ఉన్న బీసీ సమాజం మిమ్ముల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) హెచ్చరించారు. మాయ మాటలు బంద్ పెట్టి తక్షణమే (BC Reservations) బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి వెంటనే (local elections) స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరా పార్క్ వద్ద స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా (R. Krishnaiah) ఆర్ కృష్ణయ్య చేస్తున్న సత్యాగ్రహ దీక్షలో పాల్గొని ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మా బీసీల ఆత్మగౌరవంతో చెలగాటమాడితే.. మమ్మల్ని అడ్డం పెట్టుకొని మోసగించే ప్రయత్నం చేస్తే మీ భరతం పట్టడం ఖాయమని హెచ్చరించడానికే ఈ దీక్షా శిబిరం అని అన్నారు. ఇందిరా పార్క్ దగ్గర వందల మంది చేస్తున్న దీక్ష కాదు ఇది.. 50% పైబడి ఉన్న బీసీలంతా కూడా ధర్నా చౌక్ దగ్గర చేస్తున్న దీక్ష అని చెప్పారు.

మీ బీసీ పాలసీ దేశానికే ఆదర్శవంతమైందని రాహుల్ గాంధీ కీర్తిస్తున్నారని చెప్తున్నావో అది మా ప్రజానీకాన్నే మెప్పించనప్పుడు దేశ ప్రజానీకాన్ని ఎలా మెప్పిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. తమిళనాడు గవర్నమెంట్ మాత్రమే 21 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో బీసీ రిజర్వేషన్ చేయాలని సంకల్పంతో విద్య, ఉద్యోగాలు, రాజకీయాలలో కూడా రిజర్వేషన్లు కావాలని ఆ ప్రభుత్వం మాత్రమే ప్రయత్నం చేసిందన్నారు. వాళ్లు కేవలం ఆ కమిషన్ కోసమే కాకుండా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన రిపోర్టును ఎప్పటికప్పుడు అందజేస్తున్నారని తెలిపారు. ఆ కమిట్మెంట్ ఉంటే తప్ప ఇది అమలు అయ్యే పరిస్థితి లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ కాదని, 1956 నుంచి ఇవాళ్టి వరకు మీ పార్టీ 50 ఏళ్లు పరిపాలిస్తే ఒక్క బీసీ ముఖ్యమంత్రి నైనా చేశారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లే ముఖ్యమంత్రులు అవుతారు తప్ప ఒక్క బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం లేదన్నారు. ప్రాంతీయ, కుటుంబ పార్టీలు ఉన్నన్ని రోజులు వాళ్లే పరిపాలన చేస్తారు తప్ప బీసీలు పరిపాలన చేసే ఆస్కారం లేదన్నారు. ఒక బీసీని ప్రధాని, 27 మంది ఓబీసీలను మంత్రులుగా చేయగలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని కొనియాడారు. ఉపరాష్ట్రపతి పదవిని కూడా ఓబీసీకి ఇచ్చి సన్మానించుకున్న చరిత్ర మనకు తెలుసన్నారు.

ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ఎల్బీ స్టేడియానికి వచ్చి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 52 శాతంగా ఉన్న బీసీలకు ఏ పార్టీ కూడా సీఎం పదవి ఇవ్వలేకపోయిందని చెప్పారని, తెలంగాణ ప్రజలారా మాకు అధికారం ఇవ్వండి నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తాను అని ప్రకటించిన వ్యక్తి మోడీ అని వ్యాఖ్యలు గుర్తుకు చేశారు. రాబోయే కాలంలో తప్పకుండా మళ్లీ బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టే సంకల్పం ఆ బాధ్యత భారతీయ జనతా పార్టీ తప్పకుండా తీసుకుంటుందని, ఈ 42 శాతం రిజర్వేషన్ల కోసం మీరు చేస్తున్న దీక్షకు సంపూర్ణంగా అండగా ఉంటామని తెలిపారు.

Next Story