రోడ్డెక్కి కొట్టుకుంటే చులకన అవుతాం.. తుంగతుర్తి ఘర్షణపై ఎంపీ రియాక్షన్

by Prasad Jukanti |

తుంగతుర్తి నియోజకవర్గంలో ఇరువర్గాల కాంగ్రెస్ నేతల ఘర్షణపై ఎంపీ చామల స్పందించారు. ఎమ్మెల్యే మందుల సామేల్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

రోడ్డెక్కి కొట్టుకుంటే చులకన అవుతాం.. తుంగతుర్తి ఘర్షణపై ఎంపీ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఇరు వర్గాల నేతల కొట్లాటపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. రొడెక్కి కొట్టుకుంటే చులకన అవుతామని కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని నూతన మండల అధ్యక్షుల నియామకం విషయంలో చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ క్రమంలో నిన్న జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసం కావడంతో పాటు పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్ర కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో తాజాగా ఎంపీ చామల ఓ వీడియోను రిలీజ్ చేశారు.

మందుల సామేల్‍కు వ్యతిరేకం కాదు:

కార్యకర్తలం అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని పరిస్థితులను అర్థం చేసుకోవాలని కార్యకర్తలను చామల కిరణ్ కుమార్ కోరారు. నాకు, ఎమ్మెల్యే మందుల సామేల్ ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేదని కార్యకర్తలే మమ్మల్నీ గుండెల్లో పెట్టుకుని గెలిపించారన్నారు. వ్యక్తిగతంగా నేను ఏ వ్యక్తిని మండల అధ్యక్షుడిగా, సహకార సంఘాలకో ప్రమోట్ చేయమని రెకమండేషన్ చేయలేదు. మందుల సామేల్‍కు సైతం తాను మొదటి నుంచి ఇదే చెప్పానన్నారు. దేవుడి దయతో, ప్రజలు ఆశీర్వదాంతో మేమిద్దరం ప్రజాప్రతినిధులం అయ్యాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో స్థానిక నాయకులకే అవకాశం ఇచ్చి వారు ఎవరిని ఎన్నుకుంటే వారికే సర్పంచ్‍ అభ్యర్థులుగా, మండల అధ్యక్షులుగా, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, పీఏసీఎస్ వంటి పదవులకు అవకాశం ఇద్దామని చెప్పానన్నారు. అంతే తప్ప నేను ఏ నాడు మందుల సామేల్ కు ఆయన తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకం కాదన్నారు.

నా ఉద్దేశం అది కాదు:

తాను విదేశాల్లో ఉన్నప్పుడు మండల అధ్యక్షుల నియామకంపై కార్యకర్తలు అంసతృప్తి వ్యక్తం చేస్తూ తనకు ఫోన్ చేయడంతో పాటు బహిరంగంగా మాట్లాడటంతో తానే పీసీసీ చీఫ్‍కు, ఏఐసీసీ వ్యవహరాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్‍కు లేఖ రాసినట్లు చెప్పారు. తాను రాసిన లేఖలో నియమించిన మండల అధ్యక్షులను తొలగించాలని ఎక్కడా కోరలేదని, కేవలం నిర్ణయం వెల్లడిని ఆపాలని మాత్రమే కోరానన్నారు. మండల నేతలందరినీ పిలిచి మాట్లాడుదామనే కోరినట్లు చెప్పారు. అంతే తప్ప నేను మందుల సామేల్ నిర్ణయానికి తాను వ్యతిరేకం కాదన్నారు. అందరం సమిష్టిగా నిర్ణయం తీసుకుంటే పార్టీ క్యాడర్ అంతా ఏకతాటిపై ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ విషయాన్ని మందుల సామేల్ కు కూడా చెప్పానని అంతే తప్ప ఇందులో ఏ కులానికో ఏ మతానికో, ఏ వర్గానికో అన్యాయం చేయడాలనే ఆలోచన తనకు లేదన్నారు. మనల్నీ గెలిపించిన నాయకులను మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు. మాపై ఎంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. ఎన్నో మంచి పనులు చేయాల్సి ఉంది. పార్టీ పదవుల కోసం రోడ్లెక్కి కొట్టుకోవడం వల్ల మనపై ప్రజల్లో మనపై నమ్మకం సన్నగిల్లుతుందని అందుకే సంయమనం పాటించాలన్నారు. అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఒక వేళ పార్టీ నిర్ణయం నచ్చకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించుకుందామని పిలుపునిచ్చారు.

Next Story