- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డయాబెటిస్ బాధితులకు బిగ్ రిలీఫ్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో ‘షుగర్’కు చెక్
భారతదేశంలో మధుమేహం పెరుగుతున్న వేళ మెడికల్ రంగంలో విప్లవాత్మక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న మధుమేహం రోగుల భారాన్ని దృష్టిలో ఉంచుకుని డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్ (Novo Nordisk) ఓ విప్లవాత్మకమైన మందును దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా వారానికి ఒకే ఒక్కసారి తీసుకునేలా రూపొందించిన లాంగ్-యాక్టింగ్ బేసల్ ఇన్సులిన్ బ్రాండ్ ‘Awiqli’ ఇన్సులిన్ ఐకోడెక్‌ను ఇవాళ భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది.
ఏడాదికి 365 నుంచి 52 ఇంజెక్షన్ల వరకు..
వాస్తవానికి షుగర్ లెవల్ ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి సుమారు 365 సార్లు సూదులు ఒంట్లోకి ఇంజెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త ‘Awiqli’ ఇన్సులిన్ వల్ల రోగులు వారానికి ఒక్కసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. దీంతో ఏడాదికి ఇంజెక్షన్ల సంఖ్య కేవలం 52కి తగ్గనుంది. ఈ ఇన్సులిన్ పేషెంట్లకు శారీరక ఉపశమనంతో పాటు, మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దేశంలో దీనిని టైప్-1, టైప్-2 డయాబెటిస్ ఉన్న వారి కోసం ప్రత్యేకంగా రూపొందించడం విశేషం.
సామాన్యులకు అందుబాటులో ధర
భారత్‌లో డయాబెటిస్ రోగుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న నేపథ్యంలో కొత్తగా మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఇన్సులిన్ ధరను కూడా కంపెనీ అందుబాటులోనే ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రోజువారీ బేసల్ ఇన్సులిన్ల ధరలతో సమానంగా యూనిట్‌కు సుమారు రూ.3.5 పైసల చొప్పున దీని ధరను నిర్ణయించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో వార్షిక చికిత్స ఖర్చులు దాదాపు 20 నుంచి 25 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్‌లో వారం రోజుల ఇన్సులిన్ పాత పద్ధతుల కంటే మెరుగ్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ (HbA1c)ను నియంత్రించినట్లుగా రుజువైంది. రోజువారీ ఇంజెక్షన్ల నరకం నుంచి విముక్తి కల్పించే ఈ ‘Awiqli’ రాకతో భారతీయ వైద్య రంగంలో ఓ మైలురాయిగా నిలవనుంది.






