గేమ్ ఛేంజర్ రేవంత్.. బండి సంజయ్‌‌కు ఎంపీ చామల కిరణ్ కౌంటర్

by Ramesh Naini |

కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

గేమ్ ఛేంజర్ రేవంత్.. బండి సంజయ్‌‌కు ఎంపీ చామల కిరణ్ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కేరళ వెళ్లి ఏం చేశారు అనే దానిపై బండి సంజయ్ తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని, రేవంత్ రెడ్డి గేమ్ ఛేంజరా..? కాదా అనే విషయం బండి సంజయ్‌కు తెలియాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి బండి సంజయ్ చేయలేని పనిని రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో గద్దె దించారని, అది గేమ్ ఛేంజర్ అంటే అని ఎంపీ చామల స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపైనర్‌గా కేరళలో మాత్రమే ప్రచారం చేశారని, మిగిలిన అస్సాం, బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు వెళ్ళలేదని అన్నారు. రేవంత్ రెడ్డి ఫేమస్ అవుతున్నారని బండి సంజయ్ బాధపడుతున్నట్లు ఉన్నారని ఆయన చురకలు అంటించారు. తెలంగాణలో బీజేపీ 8 ఎంపీలు గెలవడంలో బీఆర్ఎస్ పాత్ర ఉందని, సిరిసిల్లలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 18 వేల ఓట్లు వస్తే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి సిరిసిల్లలో 70 వేల ఓట్లు వచ్చాయని ఎంపీ చామల ఆరోపించారు.

సిద్దిపేటలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 23 వేల ఓట్లు వస్తే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 62,800 వేల ఓట్లు వచ్చాయని, బీజేపీకి బిఆర్ఎస్ అవయవదానం చేసిందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని, అయినా ఇప్పటి వరకు సీబీఐ విచారణ ఎందుకు స్టార్ట్ చేయలేదని ఎంపీ చామల ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై జస్టిస్ మదన్ బీ లోకూర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఎందుకు సీబీఐ విచారణ ప్రారంభించలేదని, ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ స్టార్ట్ చేయకపోతే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని తెలంగాణ ప్రజలు నమ్ముతారని, 10 వ తేదీన తెలంగాణలో మోడీ పర్యటన ఉన్నందున, అంతకంటే ముందే తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ మొదలుపెట్టి మీ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు.

Next Story