బీసీ రిజర్వేషన్లపై ఏం చేస్తారో సమాధానం చెప్పాలి.. ప్రధానికి ఎంపీ, చామల కిరణ్ సూటి ప్రశ్న

by Ramesh Naini |

పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్లపై ఏం చేస్తారో తెలంగాణ బీసీ బిడ్డలకు మోడీ సమాధానం చెప్పాలని ఎంపీ చామల కిరణ్ సూటి ప్రశ్న వేశారు.

బీసీ రిజర్వేషన్లపై ఏం చేస్తారో సమాధానం చెప్పాలి.. ప్రధానికి ఎంపీ, చామల కిరణ్ సూటి ప్రశ్న
X

దిశ, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వం మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసి కాంగ్రెస్ చేతిలో పెట్టిందని, వికసిత్ భారత్ తెలంగాణ రైజింగ్‌ను అనుసంధానం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే అనేక సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి మోడీని, కేంద్ర మంత్రులను కలిసి ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ, మెట్రో ఫేజ్ 2, మూసీ పునరుజ్జీవంపై మాట్లాడారని, విభజన చట్టంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రధాని మోడీని డిమాండ్ చేస్తున్నామని ఎంపీ చామల అన్నారు.

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపైన అసెంబ్లీలో తీర్మానం చేశారని, క్యాబినెట్ లో ఆమోదించి ఆర్డినెన్స్ ఇచ్చారని చెప్పారు. కేంద్రం వద్ద బీసీ బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు. మోడీ పెద్ద బీసీ నాయకుడని బీజేపీ ప్రచారం చేస్తోందని.. పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్లపై ఏం చేస్తారో తెలంగాణ బీసీ బిడ్డలకు మోడీ సమాధానం చెప్పాలని సూటి ప్రశ్న వేశారు. కేంద్రం జనగణనలో కులగణన ఎందుకు పెట్టలేదని, జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టలేదని, దీనిపై మోడీ సమాధానం చెప్పలేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరిస్తామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Next Story